శ్రీకాకుళం, జూన్ 1 : జగనన్న కాలనీలలో ఇళ్ళ నిర్మాణానికి శంకుస్ధాపన కార్యక్రమం ఈ నెల 3వ తేదీ జరుగుతుందని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. లావేరు మండలం బెజ్జిపురం గ్రామంలో జగనన్న లే అవుట్ లో శంకుస్ధాపన కార్యక్రమం ఏర్పాట్లను మంగళ వారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా పేదలందరికి ఇళ్ళు నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించిందని ఆయన అన్నారు. ఈ మేరకు కార్యక్రమాన్ని పకడ్బందీగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. శంకుస్ధాపన కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి 3వ తేదీన వర్చవల్ విధానంలో ఉదయం 11 గంటలకు శంకుస్ధాపన చేస్తారని ఆయన తెలిపారు. జిల్లాలో మొదటి దశలో జిల్లా వ్యాప్తంగా 97,616 గృహముల నిర్మాణాన్ని రూ.1757కోట్లతో చేపట్టడం జరుగుతుందని ఆయన చెప్పారు. జిల్లాలో 830 వై.యస్.ఆర్. జగనన్న కాలనీలను ఏర్పాటు చేస్తున్నామని, లే- అవుట్ లలో 41,013 గృహాలను, భూమి స్వాధీన సర్టిఫికేట్ (LPC) జారీ చేసిన 25,007 గృహాలను, స్వంత స్థలాల్లో 31,596 గృహాలకు శంకుస్ధాపన జరుగుతుందని వివరించారు. ఇళ్ళు నిర్మాణానికి అవసరమైన నీటి సరఫరా పనులు చేయుటకు ప్రభుత్వం రూ.74 కోట్లు మంజూరు చేసిందని ఆయన చెప్పారు. బెజ్జిపురం లే అవుట్ లో 114 గృహాలను రూ.205.20 కోట్లతో నిర్మించడం జరుగుతుందని, నీటి వసతి ఏర్పాటుకు రూ.20 లక్షలు కేటాయించడం జరిగిందని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ సంస్ధ ప్రాజెక్టు డైరక్టర్ టి.వేణుగోపాల్, ఇపిడిసిఎల్ డిఇ పాత్రుడు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments