👉డివిజన్ల రిజర్వేషన్ ఖరారులో దళితులకు అన్యాయం
👉14శాతం రిజర్వేషన్లు అమలు కాలేదు
👉జిల్లా ఎన్నికల అధికారి జె.నివాస్ కి ఫిర్యాదు చేసిన దళిత సంఘాల జెఎసి నేతలు
ప్రజా పత్రిక:శ్రీకాకుళం నగర పాలక సంస్థ పరిధిలో ఇటీవల ఖరారు చేసిన డివిజన్ల రిజర్వేషన్ లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని దళిత సంఘాల జెఎసి నేతలు జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ నివాస్ ను కోరారు. ఈ మేరకు క్యాంపు కార్యాలయంలో సోమవారం రాత్రి దళిత సంఘాల జెఎసి ప్రతినిధులు కంఠ వేణు,ఎస్.వి.రమణ మాదిగ,బి.ఎస్.ఎస్.ప్రసాద్ కుమార్ ( తైక్వాండో శ్రీను) తదితర నాయకులు ఆయనను కలుసుకుని వినతి పత్రాన్ని అందజేసారు. నగర పాలక సంస్థ డివిజన్ల రిజర్వేషన్ల ఖరారులో దళితులకి అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేసారు. నగర పాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లు ఉండగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎస్.సి,ఎస్.టిలకి 14 శాతం రిజర్వేషన్ ను అమలు చేయాల్సి ఉందని , దాని ప్రకారం ఎస్.సి,ఎస్.టిలకి కలిసి 7 డివిజన్లు కేటాయించాల్సి ఉందని తెలియజేసారు. అయితే నగర పాలక సంస్థ పరిధిలో తాజాగా ఖరారైన రిజర్వేషన్లలో ఎస్.సి,ఎస్.టిలకి 6 డివిజన్లను మాత్రమే కేటాయించారని పేర్కొన్నారు. దాని వల్ల ఒక డివిజన్ లో రిజర్వేషన్ ను ఎస్.సిలు కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసారు. అలాగే డివిజన్లను రోటేషన్ పద్దతిలో రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉండగా దానిని కూడా పాటించకపోవడం వల్ల ఇతర డివిజన్లలో ఉన్న దళితులకు అవకాశం కోల్పోతున్నారని వివరించారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ల చట్ట ప్రకారం రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లను 14 శాతం కార్పొరేటర్ల స్థానాలు దళితులకు కేటాయించాల్సి ఉందనిని సెక్షన్ 6 స్పష్టంగా చెబుతోందని విన్నవించారు .అలాగే దళితులకు కేటాయించిన స్థానాలను ప్రతీ ఎన్నికలో తగువిధంగా రొటేషన్ చేయాలని కూడా సెక్షన్ 6 నిర్దేశిస్తుందని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళారు . చట్టం ఇంత స్పష్టంగా చెబుతున్నా తాజాగా విడుదల చేసిన రాజపత్రంలో మాత్రం గత స్థానాలకే దళితుల రిజర్వేషనను పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో దళితులకి అన్యాయం జరిగిందని భావిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కార్పొరేషన్లలోని కార్పొరేటర్ల స్థానాలకు సంబంధించి రిజర్వేషన్ల కోసం మున్సిపల్ శాఖ ఆర్.ఓ.సి.నెం . 5 / 2020 - ఎలక్షన్స్ పేరుతో తే 06.03.2020 దీన ఆదేశాలను విడుదల చేసిందని వివరించారు. మార్చి 1 , 2020 వ తేదీన రాష్ట్ర గజిట్లో ప్రచురితమైందని తెలిపారు . దీని ప్రకారం రాష్ట్రంలో 12 కార్పొరేషన్ల పరిధిలో 671 కార్పొరేటర్ స్థానాలను ఎస్సీ , ఎస్టీ , బిసీ మహిళలకు రిజర్వేషన్లను ఖరారు చేస్తూ మున్సిపల్ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ విజయ్ కుమార్ పేరిట ఆదేశాలు వెలువడ్డాయని పేర్కొన్నారు . అయితే , ఈ ఆదేశాలలో శ్రీకాకుళం కార్పొరేషను సంబంధించి ఎటువంటి ప్రస్తావన లేదని తెలియజేసారు . కోర్టు వివాదం కారణంగా శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగకుండా మిగిలిపోవడం వల్ల రాష్ట్ర కమిషనర్ అండ్ డైరెక్టర్ ఎమ్.మల్లికార్జున నాయక్ తే 18.05.2021 దీన లెటర్.ఆర్.ఓ.సి.నెం . 5 / 2020 - ఎలక్షన్.ఐ -2 ద్వారా జిల్లా కలెక్టర్‌కు లేఖ రాస్తూ రిజర్వేషన్లను ఖరారు చేయాలని లేఖ రాయడంతో పాటు షెడ్యూల్ కూడా పంపించడం జరిగిందని పేర్కొన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ , ఎస్టీలకు 14 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సివున్న నేపధ్యంలో 50 డివిజన్లు ఉన్న శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో ఎస్సీ , ఎస్టీలకు ఏడు స్థానాలు దక్కాల్సివుండగా వాటిని ఆరు స్థానాలకు పరిమితం చేయడం వల్ల దళితులకి నష్టం జరిగిందని వివరించారు. ఎస్సీలకు దక్కకుండా పోయిన ఆ స్థానం ఇతరులకు కేటాయించబడిందని వాపోయారు. ఈ రిజర్వేషన్ల ఖరారు అంశాన్ని పునః పరిశీలించి దళితులకు న్యాయం చేయాల్సిందిగా దళిత సంఘాల జెఎసి నేతలు జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ నివాస్ ను కోరారు. దళితులకు రాజకీయ అవకాశం కోల్పోకుండా తగిన విదంగా చర్యలు తీసుకోని న్యాయం చేయాలని వారంతా విన్నవించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ నివాస్ కార్పొరేషన్ లో డివిజన్ల రిజర్వేషన్ ఖరారు అంశాన్ని పునః పరిశీలించి న్యాయం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటానని హామినిచ్చినట్లుగా జెఎసి నేతలు తెలియజేసారు.
0 Comments