శ్రీకాకుళం:మధ్యాహ్న భోజన పథకం లక్ష్యానికి తూట్లు పొడిచేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.ఉత్తర, ఎ.మహాలక్ష్మి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు విమర్శించారు. పలు సమస్యల పరిష్కారం కోరుతూ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం (సిఐటియు) ఆధ్వర్యాన కార్మికులు శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలు పట్టించుకోకుండా శ్రమదోపిడీకి పాల్పడుతున్నాయని విమర్శించారు. రెండు దశాబ్దాలుగా కార్మికులకు కనీస హక్కులనూ అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకాన్ని నీరుగార్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. పేదరికంలో ఉన్న బాలబాలికలను ఆకలి బాధ నుంచి దూరం చేయడంలో, పాఠశాలలకు పిల్లల హాజరు శాతాన్ని పెంచడంలో, పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని తగ్గించడంలో ఈ పథకం ఎంతగానో దోహదపడుతోందని తెలిపారు. నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టి ఒక విద్యార్థికి కుకింగ్ ఛార్జీల నిమిత్తం నెలకు రూ.వంద చొప్పున చెల్లిస్తామని కేంద్రం చెప్పడం సరికాదన్నారు. పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. 172 సర్క్యులర్ ద్వారా నూతన విద్యా విధానాన్ని అమలు చేయడం వల్ల మధ్యాహ్న భోజన కార్మికులు ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకంలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులకు గౌరవ వేతనం రూ.వెయ్యి మాత్రమే ఇస్తున్నారని, పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.రెండు వేలు అదనంగా పెంచిందని చెప్పారు. ఏడాదిలో పది మాసాలకు మాత్రమే ఈ గౌరవ వేతనం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందన్నారు. కార్మికులకు కనీస వేతనాలు, గుర్తింపుకార్డులు, పిఎఫ్, ఇఎస్‌ఐ, గ్రాట్యుటీ, సామాజిక పెన్షన్ గానీ అమలు చేయకుండా తీవ్రంగా దోపిడీ చేస్తున్నాయని విమర్శించారు. మరోవైపు పథకం అమలుకు పాఠశాలలో వంటషెడ్లు, వంటపాత్రలు, మంచినీరు, గ్యాస్ సరఫరా వంటి మౌలిక సౌకర్యాలను ప్రభుత్వం కల్పించడం లేదని, పైగా పథకాన్ని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించే పనిని వేగవంతం చేస్తోందని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లాలోని పలు మండలాల్లో అక్షయపాత్ర అనే సంస్థకు ప్రభుత్వం అప్పగించిందని, ఆ సంస్థ తయారు చేసే భోజనం రుచికరంగా, నాణ్యంగా లేదని, నిబంధనల ప్రకారం ఐదు గుడ్లు ఇవ్వడం లేదని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. స్వచ్ఛంద సంస్థలకు అప్పగించిన పాఠశాలలను తిరిగి మధ్యాహ్న భోజన కార్మికులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి బకాయి ఉన్న బిల్లులను చెల్లించాలని, ప్రతినెలా ఐదో తేదీ లోపు గౌరవ వేతనం చెల్లించాలని కోరారు. భోజనం వండేందుకు అవసరమైన గ్యాస్‌ను ప్రభుత్వమే ఉచితంగా అందజేయాలని, ఉద్యోగ భద్రత కల్పించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజకీయ వేధింపులు ఆపాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, ధరల పెరుగుదలకు అనుగుణంగా బడ్జెట్ పెంచాలని కోరారు. ధర్నా అనంతరం జాయింట్ కలెక్టర్ ఆర్.శ్రీరాములు నాయుడుకు వినతిపత్రం అందజేశారు.
0 Comments