శ్రీకాకుళం:వృద్ధాప్యంలో ఉన్న వారికి ఇవాళ సామాజిక పింఛన్ల పంపిణీ అన్నది ఆర్థిక భరోసా తో పాటే సామాజిక భద్రత అన్నది ఇస్తోందని మంత్రి ధర్మాన అన్నారు. సామాజిక పింఛన్ల పంపిణీలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ,అర్హులయిన వారికి నెల మొదటి తారీఖునే నేరుగా పింఛను అందించడంతో ఈ ప్రభుత్వం తమ వెంట ఉందన్న భరోసా,ధైర్యం,నమ్మకం వారికి కలుగుతున్నాయని అన్నారు. వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీలో భాగంగా బలగలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా 8 డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు మంత్రి ధర్మాన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజాస్వామ్య దేశంలో ప్రతినిధులను ఎన్నుకునే అధికారం ప్రజల వద్దే ఉంటుంది. 2019లో వై.ఎస్.జగన్ కి అధికారం ఇచ్చారు కనుకనే ఇవన్నీ సాధ్యం అయ్యాయి. హామీలు అన్నీ నెరవేర్చేందుకు జగన్ మీరు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ప్రతి ఒక్కరిలోనూ ఆనందం నింపాలన్న సంకల్పంతో పనిచేస్తున్నారు. ఆ రోజు పాదయాత్రలో భాగంగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నవారికి అధికారం ఇస్తారా..? లేదా ఇచ్చిన మాట గాలికి వదిలిన చంద్రబాబుకు అధికారం ఇస్తారా ?
ఇవాళ మూడు వేల రూపాయలు పెన్షన్ అందుకుంటున్న అవ్వాతాతలు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇంట్లో వారికి భారం కాకుండా ధైర్యంగా బ్రతుకుతున్నారు. ఇది ఈ ప్రభుత్వం వల్లనే సాధ్యం అయ్యింది. తమను ఎవ్వరూ చూసినా,చూడపోయినా
ఈ ప్రభుత్వం మాకు తోడుగా ఉంటుందన్న ధైర్యం ఇచ్చాం. ప్రతి నెలా 1 వ తేదీన పెన్షన్ ను నేరుగా ఇంటికే వలంటీర్ తీసుకు వచ్చి అందిస్తున్నారు. పండుటాకుల కళ్లలో సంతోషాలను నింపుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వలంటీర్లు అంకిత భావంతో పనిచేస్తూ పింఛన్ల పంపిణీని పారదర్శకంగా చేపడుతూ ఉన్నారు. ప్రజల మన్ననలు అందుకుంటున్నారు.
సంక్షేమ పథకాల అమలులో భాగంగా డబ్బులు పంచేస్తున్నారు అని అంటున్న ప్రతిపక్షాలకు ఒకటే అడుగుతున్నా.. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమంటే ప్రజాధనం దుర్వినియోగమా ? అని ప్రశ్నిస్తున్నాను. రాజ్యాంగ స్ఫూర్తిని చాటుతూ పనిచేస్తున్నాం. పథకాల అమలుతో ముడిపడి ఉన్న మహత్తర ప్రయోజనాన్ని ప్రజలంతా గుర్తించాలి. వీటి వెనుక ఉన్న ఉద్దేశాన్ని గుర్తించాలి. అలానే సంక్షేమంతో పాటే అభివృద్ధికి సమున్నత ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇందులో భాగంగా శ్రీకాకుళం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అన్ని పనులూ చేపట్టాం. ఇన్ని చేసిన ప్రభుత్వానికి మీరు అందరూ తోడుగా ఉండాలి అని మంత్రి ప్రసాదరావు అన్నారు.
పాల్గొన్న ఎంపిపి అంబటి నిర్మల శ్రీనివాస్, పట్టణ వైఎస్సార్సీపీ అధ్యక్షులు సాదు వైకుంఠ రావు, వైఎస్సార్సీపీ నాయకులు బలగ గణపతి పట్నాయక్, చల్లా శ్రీనివాస్ రావు, అలుగుబెల్లి నాగభూషణం, సాదు నాగు, టంకాల బాల కృష్ణ, ఎండ రమేష్, వానపల్లి రమేష్, ఆబోతుల రామ్ మోహన్, జ్యోతి, మోహన్, బలగ సాయి కిరణ్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments