ప్రజా పత్రిక- శ్రీకాకుళం, ఏప్రిల్ 8 : జిల్లాలో జిల్లా పరిషత్ , మండల పరిషత్ ప్రాదేశిక సభ్యుల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగాయని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి జె.నివాస్ పేర్కొన్నారు. జిల్లాలో 37 జెడ్.పి.టి.సి స్థానాలతో పాటు 667 ఎం.పి.టి.సి స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా, 66 ఎం.పి.టి.సి స్థానాలు ఏకగ్రీవం కాగా,11 ఎం.పి.టి.సి స్థానాలకు నోటిఫికేషన్ జారీచేయకపోవడం వలన మిగిలిన 590 స్థానాల్లో ఎన్నికలు జరిగాయని కలెక్టర్ తెలిపారు. అన్ని చోట్ల పోలింగ్ సజావుగా జరిగిందని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని కలెక్టర్ స్పష్టం చేసారు. జిల్లాలోని సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు, మిగిలిన పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్సెర్వెర్ల నియామకం మరియు ప్రత్యేక అధికారులు స్వీయ పర్యవేక్షణ వంటి పక్కా ఏర్పాట్లవలన ఇది సాధ్యమైందని కలెక్టర్ చెప్పారు. తమతో పాటు ఎన్నికల పరిశీలకులు కె.హెచ్.బి.ఎన్.చక్రవర్తి, సంయుక్త కలెక్టర్లు సుమిత్ కుమార్, డా.కె.శ్రీనివాసులు, ఆర్.శ్రీరాములునాయుడు కూడా పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని స్వయంగా పరిశీలించడం జరిగిందని కలెక్టర్ చెప్పారు. తొలుత కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన వెబ్ కాస్టింగ్ కంట్రోల్ రూమును సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించిన ఆయన ఎచ్చెర్ల మండలం ఎస్.ఎం.పురం, బడేవానిపేట, బుడగట్లపాలెం పోలింగ్ కేంద్రంతో పాటు పలు పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్.పి అమిత్ బర్దార్ తో కలిసి సందర్శించి ఎన్నికల సరళిని పర్యవేక్షించారు. కోవిడ్ నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఎన్నికల పరిశీలకులు కె.హెచ్.బి.ఎన్.చక్రవర్తి టెక్కలి మండల పరిధిలోని కొనుసుల కొత్తూరు, కోటబొమ్మాళి, నిమ్మాడ పోలింగ్ కేంద్రాలతో పాటు పలాస మండలం పెదంచల, చినంచల. గోదావారిపురం, గంగువాడ పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ నిమ్మాడ, కోటబొమ్మాళి పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడ ఎన్నికల ప్రక్రియను నిశితంగా పరిశీలించిన ఆయన ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
0 Comments