శ్రీకాకుళం, జూన్ 17 : కుటుంబ ప్రధాన పోషకుడు కోవిడ్ కు గురై మృతి చెందిన వెనుకబడిన తరగతులకు చెందిన కుటుంబాలకు రాయితీతో కూడిన రుణాలు అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం చైర్మన్ శ్రికేష లాఠకర్ అన్నారు. ప్రధాన పోషణకర్త కరోనా బారిన పడి చనిపోతే కుటుంబములోని తదుపరి పోషణకర్తకు బి.సి. కార్పోరేషన్ ద్వారా నేరుగా ఎన్.బి.సి.ఎఫ్.డి.సి నిధులతో స్వయం ఉపాధి పథకాలు మంజూరు చేయడం జరుగతుందన్నారు.
ఒక్కొక్క కుటుంబానికి గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు స్వయం ఉపాధి పథకాలు 20 శాతం సబ్సిడీతో మంజూరు చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. చనిపోయిన కుటుంబ పోషణకర్త 18 - 60 సంవత్సరముల వయసు కలిగిన వారుగా ఉండాలని, కుటుంబ సంవత్సర ఆదాయము రూ.3 లక్షలు లోపు ఉండాలని ఆయన చెప్పారు. ఆధార్ కార్డు, రేషన్, రైస్ కార్డు, కరోనా భారిన పడి చనిపోయిన మరణ ధృవీకరణ పత్రము, కుల ధృవీకరణ పత్రము కలిగి ఉండాలని ఆయన వివించారు. ప్రతిపాదిత దరఖాస్తులు ఈ నెల 22వ తేదిలోపు బి.సి. కార్పోరేషన్ కార్యాలయానికి సమర్పించాలని ఆయన కోరారు. జిల్లాలో అందరు మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమీషనర్లు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. మండల, మున్సిపాలిటీలలో కరోనా బారిన పడి చనిపోయిన బిసి కుటుంబములోని సభ్యులు తక్షణమే గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమీషనర్లకు ప్రతిపాదనలను అవరసరమైన ధ్రువ పత్రములతో సమర్పించాలని పేర్కొన్నారు.
0 Comments