శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం పనుకువలస గ్రామంలో పనుల్లేక ఇరవై ఏళ్ల కిందట నెల్లూరు జిల్లాకు వలస వెళ్లిపోయారు ఆ తల్లిదండ్రులు. అక్కడ వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వారి కష్టం ఎట్టకేలకు ఫలించింది. కుమారుడు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)లో శాస్త్రవేత్తగా ఎంపికకావడంలో వారి ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. పాలకొండ మండలం పనుకువలస గ్రామానికి చెందిన పొట్నూరు సింహాద్రి నాయుడు, పద్మావతి దంపతుల కుమారుడు రాజీవ్. తల్లిదండ్రులిద్దరూ నెల్లూరు జిల్లాకు వలస వెళ్లిపోవడంతో అమ్మమ్మ, తాతయ్యల దగ్గరే పెరిగారు. నాల్గో తరగతి వరకు అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. ఎస్‌ఎంపురంలోని గురుకుల పాఠశాలలో పది పూర్తి చేశారు. అనంతరం నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీటు సాధించి ఇంజినీరింగ్ పట్టా పొందారు. 2019 అక్టోబర్‌లో సచివాలయ ఇంజినీరింగ్ కార్యదర్శిగా ఎంపికై 9 నెలలు విధులు నిర్వర్తించారు. 2020 ఆగస్టులో రైల్వేలో జూనియర్ ఇంజినీర్‌గా కొలువు రావడంతో ఇప్పటివరకు చెన్నైలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. 2019లోనే ప్రారంభమైన ఇస్రో సైంటిస్ట్ ఉద్యోగ నియామక ప్రక్రియలో వివిధ దశలను దాటుకొని తుది ఎంపికలో పేరు పదిలం చేసుకున్నారు. ఈనెల 23లోగా శ్రీహరికోటలో విధుల్లో చేరాలని వర్తమానం అందుకున్నారు. కుటుంబసభ్యులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం, వాణిజ్యపన్నులశాఖ సహాయ కమిషనర్ జి.రాణీమోహన్ తోడ్పాటు తన విజయానికి ఎంతో దోహదపడ్డాయని, వారందరినీ ఎప్పటికీ మరచిపోలేనని రాజీవ్ పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఉంటున్న జిల్లాలోనే పోస్టింగ్ రావడంతో దగ్గరుండి వాళ్లను చూసుకుంటానని చెబుతున్నారు
0 Comments