ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై విషం కక్కొద్దు!-పవన్ వి సినిమా రాజకీయాలు. -మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్.

శ్రీకాకుళం, నవంబర్ 14:రాజధాని పేరుతో ఉత్తరాంధ్ర ప్రజల్ని అధికార పార్టీ నాయకులు మోసం చేస్తున్నారని జనసేన పవన్ వ్యాఖ్యానించడం అతని నీచ రాజకీయానికి నిదర్శనమని మాజీ డిప్యూటీ సీఎం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, నరసన్నపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. విజయనగరంలో శనివార పర్యటన సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఆదివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ గత మూడేళ్లుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ విషం చిమ్ముతున్నారని, సినిమా రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పేదలకు గృహనిర్మాణం కోసం పెద్ద యజ్ఞమే జరుగుతోందని అది పవన్ కి కనిపించ లేదా? అని ప్రశ్నించారు. ఇళ్ల స్థలాల ధరలు ఆకాశాన్నంటుతున్న సందర్భంలో అత్యంత విలువైన చోట్ల కూడా తమ ప్రభుత్వం పేదల పక్షపాతిగా ఇంటిపట్టాలు అందజేసిందని తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన ఇళ్ల నిర్మాణం జరుగుతుంటే ఓర్చుకోలేని పవన్ కళ్యాణ్ అవాకులు చెవాకులు పేలితే ఎవరూ నమ్మరన్నారు. మూడు సెంట్లలో పక్కాఇళ్లు ఎందుకు కట్టించలేదని పవన్ చంద్రబాబును ఒకసారైనా ప్రశ్నించారా? అని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ వి దిగజారుడు ఆలోచనలని, నిజమైన అభివృద్ధి జరుగుతుంటే అసలు ఏమీ జరగడం లేదంటూ అబద్ధాలు చెప్పేటందుకు ప్రయత్నాలు చేయడం అతని నైతిక స్థాయి దిగజారిందనడానికి నిదర్శనమన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖ రాజధాని కావాలని, తద్వారా అభివృద్ధికి బాటలు వేయాలని బలంగా కోరుకుంటే దానిపై పవన్ కళ్యాణ్ మాట్లాడరని విమర్శించారు. ఇప్పటికైనా కళ్ల ముందు కనిపించే వాస్తవాలు చూడాలని, కళ్లు మూసుకుని నోటికి వచ్చినట్టు మాట్లాడితే మళ్లీ జనమే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని కృష్ణదాస్ హెచ్చరించారు.

Post a Comment

0 Comments