శ్రీకాకుళం, జూలై 15: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖాధికారులందరూ ప్రజా సేవకులని, కావున ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి అధికారి కృషిచేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జునైద్ అహ్మద్ మౌలానా, శాశ్వత లోక్ అదాలత్ (ప్రజా ప్రయోజన సేవలు) చైర్మన్ జి.జ్ఞాన శ్రీ సువర్ణరాజు జిల్లా అధికారులకు సూచించారు. శాశ్వత లోక్ అదాలత్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో హై లెవెల్ కమిటీ సమావేశం శనివారం న్యాయ సేవా సదన్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రజా ప్రయోజన సేవలకు భంగం వాటిల్లితే, ఆ వ్యక్తి శాశ్వత లోక్ అదాలత్ ను ఆశ్రయించవచ్చన్నారు. ఆ విధంగా వచ్చిన కేసులను శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ తీర్మానించి, సమస్యను బట్టి సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీచేయడం జరుగుతుందని, సమస్య లేకుంటే ఆ కేసును ముగించడం జరుగుతుందని తెలిపారు. శాశ్వత లోక్ అదాలత్ ద్వారా అందిస్తున్న సేవలు గురించి ప్రజల్లో సరైన అవగాహన లేదని, ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో కేసులు చేయడానికి ఎటువంటి ఫీజులు చెల్లించనవసరం లేదని చెప్పారు. ఎటువంటి కేసులనైనా కేవలం 90 రోజుల్లో పరిష్కారమవుతుందని, సివిల్ కోర్టుల్లో మాదిరిగా ఏళ్ల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఉండబోదని స్పష్టం చేశారు. ఇరువర్గాల వాదనలతో సమస్య పరిష్కారం కాబడుతుందని వివరించారు. ఇటువంటి వ్యవస్థ పట్ల అధికారులు మరింత శ్రద్ధ వహించి, ఆయా శాఖాధికారుల నుండి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేలా కృషిచేయాలని పిలుపునిచ్చారు. శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ జి. జ్ఞానసువర్ణరాజు మాట్లాడుతూ జిల్లాలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల ద్వారా అందజేయబడుతున్న సేవలు గురించి ఆయా శాఖాధికారుల అడిగి తెలుసుకున్నారు. గృహ నిర్మాణ సంస్థ, రెవిన్యూ, ప్రజా రవాణా సంస్థ, నగర పాలక సంస్థ, తపాలా, బ్యాంకింగ్, ఉపాధిహామీ, నీటిసరఫరా, పారిశుద్ధ్యం, విద్య, భీమా, వైద్య సేవలు, విద్యుత్, టెలిఫోన్ తదితర సేవలు సమాజంలోని పౌరులకు పక్కాగా అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రభుత్వ అధికారులపై శాఖలు, సంస్థలలోని లోపాలు కారణంగానే కోర్టును ఆశ్రయిస్తారని, అటువంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన భాద్యత అధికారులు పరిశీలించాలని కోరారు.
ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు, నగరపాలక సంస్థ కమిషనర్ ఓబులేసు, సంబంధిత శాఖల అధికార ప్రతినిధులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments