శ్రీకాకుళం:జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి అధ్వర్యంలో జాతీయ వరి పరిశోధన సంస్థ మన రాష్ట్రంలో నెలకొల్పాలనుకున్న ప్రాంతీయ తీర ప్రాంత వరి పరిశోధన కేంద్రాన్ని మన జిల్లాలోని నైరా వ్యవసాయ క్షేత్రంలో నెలకొల్పేందుకు, 2017 లో చేసుకున్న ఒప్పందం నేటికీ పూర్తి స్థాయిలో పూర్తి కాలేదని బిజెపి శ్రీకాకుళం అసెంబ్లీ ఇంఛార్జ్ చల్లా వెంకటేశ్వర రావు ఆరోపించారు. నియోజకవర్గ బిజెపి నాయకులతో కలిసి ఈ రోజు నైరా వ్యవసాయ కళాశాల డీన్ ని కలిసి, వివరాలు తెలుసుకున్నారు. ఒప్పందం ప్రకారం వరి పరిశోధన కేంద్రానికి కేటాయించాల్సిన 25 ఎకరాల భూమి లీజు అగ్రిమెంట్ విషయంలో జాప్యం జరిగిందని, త్వరలో అది పూర్తికానుందని డీన్ తెలియజేసినట్లుగా చల్లా వెంకటేశ్వర రావు తెలిపారు. ప్రస్తుతానికి పరిశోధన కేంద్రం పనిచేస్తుందని, నలుగురు సైంటిస్టులతో పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు.
అనంతరం వరి పరిశోధన కేంద్రాన్ని సందర్శించి, అక్కడి సైంటిస్ట్ గాంధితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతానికి పరిశోధనలు జరుగుతున్నాయని, కటక్ లోని జాతీయ వరి పరిశోధన కేంద్రంలో అభివృద్ధి చేసిన సిఆర్ 412, 414 వరి వంగడాలను ఇక్కడ పరీక్షిస్తున్నామని, అధిక దిగుబడి వస్తుందని, పూర్తి స్థాయిలో కేంద్రం పూర్తయితే మరిన్ని మేలైన వరి విత్తనాలను అభివృద్ధి చేస్తామని గాంధి తెలిపారన్నారు.
జాతీయ స్థాయి సంస్థలు, ప్రాజక్టులు జిల్లాలో నెలకొల్పే సమయంలో, జిల్లా ప్రజాప్రతినిధులు చొరవ చూపి వాటి సమస్యలు పరిష్కరించాలని, ఈ ప్రాంతీయ వరి పరిశోధన కేంద్రానికి ఇచ్చే భూమి అగ్రిమెంట్ వెంటనే పూర్తయ్యేందుకు జిల్లా అధికారులు కృషి చేయాలని చల్లా వెంకటేశ్వర రావు కోరారు.
ఈ కార్యక్రమంలో చల్లా వెంకటేశ్వర రావుతో పాటు బిజెపి నాయకులు సాధు కిరణ్ కుమార్, రావాడ పురుషోత్తం, భైరి అప్పారావు, మూకళ్ళ లక్ష్మీనారాయణ, సాధు మళ్లేశ్వర రావు, గురువు రేవతి తదితరులు పాల్గొన్నారు
0 Comments