ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

క్రీడలకు పురిటిగడ్డ శ్రీకాకుళం జిల్లా.ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్

*క్రీడలు క్రమశిక్షణకు నాంది*
*క్రీడలతోనే శారీరక దృఢత్వం*

*క్రీడలకు పురిటిగడ్డ శ్రీకాకుళం జిల్లా*

*జిల్లాలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం ఆనందదాయాకం*

*ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ వెల్లడి*

శ్రీకాకుళం (మబుగాం), జూలై 06 : క్రీడలు శారీరిక దృఢత్వంతో పాటు శక్తిని పెంచుతుందని ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు , మాజీ ఉప ముఖ్యమంత్రి, నరసన్నపేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. రాష్ట్ర వూషు అసోసియేషన్ ఆధ్వర్యాన జిల్లాలో ఈ నెల 15, 16వ తేదీల్లో జరుగునున్న 10వ సబ్ జూనియర్, 9వ జూనియర్ బాల,బాలికల రాష్ట్రస్థాయి వూషు పోటీలను శ్రీకాకుళంలో నిర్వహించనున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో వూషు క్రీడలకు సంబంధించిన గోడ పత్రికతో పాటు క్రీడలలో గెలుపొందిన వారికి బహుమతిగా అందివ్వనున్న పథకాలను మబుగాంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ధర్మాన కృష్ణదాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానవాళికి క్రమశిక్షణా మార్గంలో పెట్టేందుకు ఎంతో దోహదపడతాయని అన్నారు. క్రీడలకు శ్రీకాకుళం జిల్లా పురిటిగడ్డ అని, ఇక్కడ నుండి పలు క్రీడలలో ఎంతోమంది క్రీడా ప్రతిభావంతులు ఉన్నారని , క్రీడలు నేర్చుకోవడం వలన మానసిక ఉల్లాసం,మనోస్థైర్యం,ఆరోగ్యవంతంగా ఉంటారని తెలిపారు. జిల్లాలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం ఆనందదాయకమని ఆయన కొనియాడారు. రాష్ట్ర పోటీలకు వివిధ జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారుల వసతుల ఏర్పాట్లపై ఆరా తీసిన ఆయన క్రీడాకారులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా చూడాలని, తద్వారా జిల్లాకు మంచి పేరు తెచ్చేటట్లు వ్యవహరించాలని నిర్వాహకులను కోరారు . రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న వూషు క్రీడాకారులకు అన్ని వసతులు సమకుర్చామని , గార మండలం ఒప్పంగి గ్రామంలో ఉన్న ఈటీఎస్ ఫంక్షన్ హాల్లో ఈ రాష్ట్ర స్థాయి వూషు క్రీడలకు సంబంధించిన మౌలిక వసతులతో పాటు అన్ని ఏర్పాటు పూర్తి చేసినట్లు జిల్లా ఉషూ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రెడ్డి శివకుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో టైక్వాండో అసోసియేషన్ ఆఫ్ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి కొమర భాస్కరరావు, వూషు సీనియర్ శిక్షకులు కురిటి తారకరామ, కొమర మోహనకృష్ణ, బైరి ధనంజయరావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments