ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

విద్యుత్ ప్రమాదాలను అరికడదాం.

విద్యుత్ ప్రమాదాలను అరికడదాం.

-ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ ఎన్ కృష్ణ మూర్తి 

శ్రీకాకుళం, జూలై 22: విద్యుత్తు భద్రతాప్రమాణాలు పాటిస్తూ.. ప్రమాదాలను నివారిద్దామని విద్యుత్ వినియోగదారులకు ఏపీఈపీడీసీఎల్ సూపరెంటెండింగ్ ఇంజనీర్ ఎన్ కృష్ణ మూర్తి పిలుపునిచ్చారు. భారీ వర్షాలు, గాలులు ఉన్నపుడు ప్రజలు విద్యుత్ ప్రమాదాలకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తుఫాన్ సమయంలో మీ ఇంటి గృహోపకరణాల స్విచ్ లను ఆఫ్ మోడ్లో ఉంచాలని, ఇంటి లోపల కరెంటు స్విచ్ బోర్డులో స్విచ్ లను తడి చేతులతో ఆన్, ఆఫ్ చేయరాదన్నారు. చిన్న పిల్లలను కరెంటు వస్తువులను తాకనీయరాదని, ఇంటి సర్వీసు వైరు తెగినా, జాయింట్స్ కట్ అయినా.. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాకకూడదన్నారు. వర్షం పడుతున్నపుడు విద్యుత్ స్తంబాలు, స్టే వైర్లను ముట్టుకొనరాదని, ఇంటి పరిసరాలలో చెట్లు, కరెంటు పోల్స్ పడినా, వాలినా, కరెంటు వైర్లు తెగినా వెంటనే విద్యుత్ కార్యాలయం లేదా కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇవ్వాలన్నారు. ఇంటి ఆవరణలో వున్న నీళ్ల మోటారు, నీటి పంపులను, వాటికి వున్న కరంటు వైర్లను, జాయింట్స్ ను తాకకూడదని, గాలి వాన సమయంలో కరెంటు లైన్ క్రింద నిలబడటం కానీ, కూర్చోవడం కానీ చేయరాదని, ఏ ప్రదేశములోనైనా విద్యుత్ ప్రసారం జరిగే తీగలు (కండక్టర్) తెగి పడి వుంటే దానిని విద్యుత్ ప్రసారం ఉన్నదిగా పరిగణించి, సరియైన రక్షణ కల్పించే వరకు వాటిని నేరుగా తాకకుండా వెంటనే విద్యుత్ శాఖ సిబ్బంది కి లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1912 కి తెలియచేయాలన్నారు. మోటార్ల స్టార్టర్లు, మోటార్లు వర్షం వల్ల నీటిలో మునగడం, పూర్తిగా తడవడం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉంది కాబట్టి రైతులు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏదైనా విద్యుత్ ప్రమాదం జరిగినట్లు గమనించిన యెడల ఆ వ్యక్తిని గాని, విద్యుత్ పరికరాన్ని గాని నేరుగా తాకరాదని, వెంటనే దగ్గరలోని విద్యుత్ అధికారి/సిబ్బంది కి తెలియపరచాలని ఎస్ఈ తెలిపారు.
         ఇళ్లు, భవన నిర్మాణాల సమయంలో నిర్మాణదారులు తగిన రక్షణ చర్యలు చేపట్టకుండా అజాగ్రత్తగా ఉండడం వలన ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని నివారించేందుకు కొన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించాలని వినియోగదారులకు ఎస్ఈ ఎన్ కృష్ణ మూర్తి విజ్ఞప్తి చేశారు. వినియోగదారులు వారి భవనాల ఆవరణలోని అంతర్గత వైరింగ్ కు ఉపయోగించే విద్యుత్ వైర్లు, స్విచ్ లు, పరికరాల్ని నాణ్యత (ఐఎస్ఐ) కలిగిన వాటిని ఉపయోగించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. ఇళ్లలోని స్విచ్ బోర్డులను పిల్లలకు అందనంత ఎత్తులో అమర్చుకోవాలని, ప్రతి ఇంటి విద్యుత్ సర్వీస్ కు, ఇంట్లో ఉపయోగించే పరికరాలకు తప్పనిసరిగా ఎర్త్ పైప్ ద్వారా ఎర్తింగ్ ఏర్పాటు చేసి ప్రమాదాల్ని అరికట్టవచ్చన్నారు. ఇళ్ల డాబాలపైన దుస్తులు ఆరవేసేటప్పుడు, ఇళ్ల నిర్మాణ ప్రాంతాల్లో ఇళ్లపైన/సమీపాన విద్యుత్ సరఫరా ఉంటే నిబంధనల ప్రకారం తగినంత దూరం పాటించాలన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నెంబరు 1912 కు తెలియజేయాలన్నారు.

Post a Comment

0 Comments