పకడ్బందీగా ఈ పంట నమోదు
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
మీకోసం వినతుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు
జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం, ఆగస్టు 27: త్వరలోనే జరగనున్న గ్రామ రెవెన్యూ సదస్సులకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి మంగళవారం సాయంత్రం ఆయన జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ తో కలసి రెవిన్యూ సదస్సులు, డ్వామా, ఓటర్ల జాబితా రూపకల్పన, కోర్టు కేసులు, ఈ పంట, ఇసుక లభ్యత, గృహనిర్మాణం, పారిశుధ్యం, సీజనల్ వ్యాధులు తదితర అంశాలపై జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీవోలు, తహసీల్దార్, ఎంపిడివోలు, మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయి సిబ్బందితో మాట్లాడారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ త్వరలో సున్నితమైన భూ సమస్యలపై సదస్సులు నిర్వహిస్తున్నందున సంబంధిత రెవెన్యూ అధికారులు పక్కాగా కార్యాచరణ ప్రణాళికలకు సిద్ధం చేయాలని అన్నారు. ముఖ్యంగా అసైన్డ్ భూములపై మరోసారి సర్వే పూర్తి చేయాలని, జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో త్వరలోనే గ్రామాల వారీ తేదీలు ఖరారు చేస్తామని, ప్రతిష్టాత్మక ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. మీ కోసంలో వచ్చిన వినతులలో ఎన్ని పరిష్కరించారు? ఎన్ని వివిధ దశలలో ఉన్నాయో? ప్రతిరోజు సమీక్షించాలన్నారు. రీ ఓపెన్ కేసులు ఒక్కటి కూడా నమోదు కావొద్దని చెప్పారు.
పారిశుద్ధ్యం విషయంలో, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో అలసత్వం పనికి రాదని ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులకు సంబంధించి అందిన క్లెయిమ్ లను సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. కోర్టు కేసుల పట్ల అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు. ఈ పంట నమోదుకు సెప్టెంబర్ 15 వరకు మాత్రమే సమయం ఉందని, ఈ లోగా పంట వివరాలు నమోదు చేయాలన్నారు. ఈ పంట నమోదు పూర్తి చేయడంలో గ్రామ రెవెన్యూ అధికారులు, వ్యవసాయ అధికారులు వాటిని నిర్ధారణ చేయాల్సి ఉందన్నారు. ఈ పంట నమోదు లో 60 శాతం కంటే తక్కువ మండలాలు రానున్న వారంలో పురోగతి సాధించాలని అన్నారు. కుల ధ్రువీకరణ పత్రాల జారీలో పొరపాట్లు కు తావులేని విధంగా క్షేత్రస్థాయిలో అన్ని విధాలుగా విచారించిన తరువాతే జారీ చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. త్వరలో జరగనున్న ఉద్యోగుల బదిలీలను పారదర్శకంగా చేపట్టాలని సూచించారు.
ఈ కాన్ఫరెన్స్ లో జిల్లా రెవిన్యూ అధికారి అప్పారావు, జిల్లా పరిషత్ సీఈవో ఎం.వెంకటేశ్వరరావు, డీపీవో ఆర్.వెంకట్ రామన్, సీపీవో ప్రసన్న లక్ష్మి, ఐసిడిఎస్ పీడీ బి.శాంతి శ్రీ, జిల్లా వ్యవసాయ శాఖాధికారి కే.శ్రీధర్, గ్రామ వార్డు సచివాలయల నోడల్ అధికారి వాసుదేవరావు, అన్ని మండల తహశీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.
0 Comments