ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

14 నుంచి పల్లె పండుగ :ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

శ్రీకాకుళం, అక్టోబర్ 8 :ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా 'పల్లె పండుగ' పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో పల్లె పండుగ కార్యక్రమాలపై మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా సన్నద్ధతపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ
జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు, అన్ని పంచాయతీలు పరిధిలో 3071 పనులను గుర్తించి, వాటికి సంబంధించి రూ.249 కోట్లు అంచనాలు వేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 2714 పనులకు సంబంధించి ప్రతిపాదనలకు అనుమతులు ఇచ్చి, అప్లోడ్ చేశామని, మిగిలినవి రానున్న రెండు రోజుల్లో పూర్తి చేస్తామని వివరించారు. ఆయా పనులకు ఎలాంటి ఇసుక కొరత లేదని, సిమెంట్ కి సంబంధించి డీలర్లతో మాట్లాడుతున్నామని చెప్పారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పల్లె పండుగ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, సర్పంచులు, ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయాలని చెప్పారు. గత ఆగస్టు 23న రాష్ట్రవ్యాప్తంగా 13,325 పంచాయతీల్లో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేయించిన పనులకు కలెక్టర్లే పరిపాలన అనుమతులు ఇచ్చారని, అన్ని పనులకూ 14వ తేదీ నుంచి వారం రోజుల వ్యవధిలో శంకుస్థాపనలు చేయించి, అంతే వేగంగా పూర్తి చేయించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ నిధులు రూ.2500 కోట్లతో దాదాపు 20వేల పనులకు శంకుస్థాపనలు జరగనున్నాయని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. సమావేశంలో డ్వామా పీడీ బి.సుధాకర్, జడ్పీ సీఈవో ఎల్ ఎన్ వి. శ్రీధర్ రాజా, జిల్లా పంచాయతీ అధికారి కె.భారతి సౌజన్య తదితరులు సమావేశంలో ఉన్నారు.

Post a Comment

0 Comments