నరసన్నపేట: పులివెందులలో జరుగుతున్న జడ్పిటిసి ఎన్నికల సందర్భంగా జరిగిన దారుణ అక్రమాలపై మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తీవ్రంగా స్పందించారు. "ఈ రోజు ప్రజాస్వామ్య చరిత్రలో ఒక బ్లాక్ డే. పులివెందులలో ప్రజాస్వామ్యం పూర్తిగా హరించబడింది. మా పార్టీ జడ్పిటిసి అభ్యర్థికి కూడా ఓటు వేయించకుండా అడ్డుకోవడం అంటే పరిస్థితులు ఎంత దిగజారిపోయాయో చూపిస్తోంది. ఇది పాలకుల చేతగానితనానికి, నిరంకుశత్వానికి నిదర్శనం. ప్రజలు ఓటు వేయకుండా అడ్డుకోవడం ఎన్నికల ప్రక్రియను హత్య చేసినట్లే," అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
"ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు పూర్తిగా అక్రమం, రాజకీయ కక్షసాధనకు నిదర్శనం" అని కృష్ణదాస్ గారు తీవ్రంగా విమర్శించారు.
"తెల్లవారుజామున సమాచారం ఇవ్వకుండా, ఎలాంటి చట్టబద్ధ కారణం లేకుండా ఆయనను హౌస్ అరెస్ట్ చేసి, తరువాత అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. టీడీపీ ఏజెంట్లు దాడులు చేస్తుంటే వారిపై చర్యలు తీసుకోకుండా, ప్రతిపక్ష నాయకులను అడ్డుకోవడం చట్టం పట్ల పోలీసుల మొఖం ఎటు తిరిగిందో చూపిస్తోంది" అని ఆయన మండిపడుతూ కొన్ని డిమాండ్లు చేశారు.
1. పులివెందుల జడ్పిటిసి ఎన్నికలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాతంగా నిర్వహించాలి.
2. జరిగిన అక్రమాలపై న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి విచారణ జరపాలి.
3. ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకొని ప్రజాస్వామ్య పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలి.
"ప్రజల ఓటు హక్కు పవిత్రమైనది. దాన్ని దోపిడీ చేయడం చరిత్ర ఎప్పటికీ క్షమించదు. పులివెందులలో నేడు జరిగినది ఎన్నిక కాదు — ప్రజాస్వామ్యానికి జరిగిన అంత్యక్రియలు," అని ధర్మాన కృష్ణదాస్ తీవ్రంగా స్పందించారు.
0 Comments