శ్రీకాకుళం : ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అధ్యాపకులకు కూడా ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉత్తమ ఉపాధ్యాయ అధ్యాపక అవార్డులను ఇవ్వాలని ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గంగు మన్మధరావు కోరారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ లో అక్షరాస్యతలో వంద శాతం ఉత్తీర్ణత సాధించడానికి ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ పాత్ర కీలకమన్నారు. గవర్నమెంట్ స్టూడెంట్స్ కన్నా.. గవర్నమెంట్ టీచర్స్, లెక్చరర్స్ కన్నా.. ప్రైవేట్ స్టూడెంట్స్.. ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ అధికమన్నారు. తమకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉత్తమ ఉపాధ్యాయ, అధ్యాపక అవార్డుల ఎంపికలో ప్రైవేటు ఉపాధ్యాయులను, అధ్యాపకులను కూడా చేర్చాలని కోరారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల అధ్యాపకులతో పాటు ప్రైవేట్ ఉపాధ్యాయులు అధ్యాపకుల సమిష్టి కృషితోనే విద్యావ్యవస్థలో సమూల మార్పులు వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖా మంత్రి, విద్యా శాఖ కమీషనర్, అన్ని స్థాయిల విద్యా శాఖాధికారులు జోక్యం చేసు కుని ప్రైవేట్ ఉపాధ్యాయుల అధ్యాపకుల కృషిని గుర్తించి ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఉత్తమ అవార్డులు ఇవ్వాలని కోరారు.ప్రతి ఏడాది సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉపాధ్యాయ సేవలకుగానూ అవార్డులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందన్నారు. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు మాత్రమే అని కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారన్నారు. అటెండర్ స్థాయి ఉద్యోగి పిల్లల నుండి అఖిల భారత సర్వీసెస్ లో పనిచేసే వారి పిల్లల వరకు విద్యాబుద్ధులు నేర్పి నీట్, ఐఐటి జెఈఈ మైన్స్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలలో పదవ, ఇంటర్మీడియట్ వంటి పరీక్షలలో ఉత్తమ ర్యాంకులకు కారకులు ప్రయివేట్ టీచర్స్, లెక్చర్స్ కాదా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ శ్రమను గుర్తించాలని కోరారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా ఉత్తమ ఉపాధ్యాయ, అధ్యాపక అవార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయనతోపాటు జిల్లా అధ్యక్షులు నాగశివ, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
0 Comments