
ప్రజా పత్రిక - శ్రీకాకుళం, ఏప్రిల్ 9 : భారత ప్రధాని పిలుపు మేరకు జిల్లాలో ఈ నెల 11 నుండి 14 వరకు కోవిడ్ టీకా ఉత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు. ఈ టీకా ఉత్సవ్ కార్యక్రమాన్ని జిల్లాలో గల పి.హెచ్.సి పరిధిలోని సచివాలయాలన్ని తీసుకొని, ఆ సచివాలయం పరిధిలో గల 45 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరికీ వేక్సినేషన్ వేసేలా చర్యలు తీసుకోబోతున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాకు ఇప్పటికే కోవిడ్ వేక్సినేషన్లు వచ్చాయని, వచ్చిన వేక్సినేషన్లను బట్టి సమానంగా పంపిణీచేస్తూ అందరికీ వేక్సినేషన్ అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ స్పష్టం చేసారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కోవిడ్ సెకెండ్ వేవ్ పై తీసుకోవలసిన చర్యలు, జాగ్రత్తలు వంటి అంశాలపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో కరోన తగ్గుముఖం పట్టిందనే భావనతో ఎవరూ కనీస నియమ నిబంధలను పాటించడలేదని, తద్వారా రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా తప్పనిసరిగా మాస్కులను ధరిస్తూ, సామాజిక దూరం పాటించాలని, సబ్బు లేదా సానిటైజర్ తో చేతులను పరిశుభ్రం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. గురువారం ఒక్కరోజే 185 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, అందులో 30 శాతం కేసులు శ్రీకాకుళం పట్టణంలోనే ఉన్నాయని అన్నారు. ఇప్పటికైనా ప్రజలు తగు జాగ్రత్తలు పాటించకపోతే భవిష్యత్తులో మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉందన్నారు. కరోనాను నియంత్రించేందుకు కోవిడ్ నియమ నిబంధనలతో పాటు వేక్షినేషన్ తప్పనిసరి అని, కావున 45 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు విధిగా టీకా తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలోని అర్హన్ పి.హెచ్.సిలతో పాటు ప్రతీ సచివాలయం స్థాయిలో వేక్సినేషన్ కార్యక్రమం ప్రతిరోజూ జరుగుతుందని అన్నారు.అర్హన్ పి.హెచ్.సిలతో పాటు ప్రతీ సచివాలయం స్థాయిలో వేక్సినేషన్ కార్యక్రమం అనేది ప్రతిరోజూ జరుగుతుందని, అర్బన్ ఏరియాల్లో 600 వరకు, అలాగే సచివాలయాలతో కలిపి రోజుకు 7 వేల వరకు వేక్సినేషన్ వేయడం జరుగుతుందని అన్నారు. జిల్లాలోని 16 అర్బన్ పి.హెచ్.సిలతో పాటు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా టీకాలు వేయడం జరుగుతుందని, ఇప్పటివరకు 31,600 మందికి టీకాలు వేశామని, గురువారం ఒక్కరోజే 7,134 మందికి కోవిడ్ టీకాలు వేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు. కరోనా సెకెండ్ వేవ్ అదుపుచేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాయని, అందులో భాగంగా ఈ నెల 11 నుండి 14 వరకు టీకా ఉత్సవ్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే జిల్లాకు కోవిడ్ డోసులు రావడం జరిగిందని, తద్వారా ఈ ఉత్సవ్ కార్యక్రమాన్ని ప్రణాళికబద్ధంగా వేక్సినేషన్ కార్యక్రమాన్ని ముమ్మరం చేసి అర్బన్ ఏరియాలతో పాటు సచివాలయ స్థాయిలో అందరికి వేక్సిన్ వేసేందుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ వివరించారు. కావున జిల్లాలో 45 ఏళ్ళు దాటిన వారందరూ సామాజిక బాధ్యతగా టీకా తీసుకొని కరోనాను కట్టడి చేసేందుకు సహకరించాలని కలెక్టర్ జిల్లా ప్రజలను కోరారు.
0 Comments