కోవిడ్ మరణం సంభవించరాదు
జిల్లాలో కోవిడ్ కొరకు ముమ్మర ఏర్పాట్లు చేయాలి
45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి కోవిడ్ వేక్సిన్.
హోమ్ ఐసోలేషన్లో ఉన్నవారికి ప్రత్యేక కిట్లు, పర్యవేక్షణ.
కోవిడ్ పేషెంట్ల కొరకు ప్రత్యేక రవాణా ఏర్పాట్లు.
కోవిడ్ పేషెంట్ల కొరకు ఆసుపత్రులలో బెడ్లు.
కరోనా నియంత్రణకు ప్రజలు సహకరించాలి .
-అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ జె.నివాస్ –
ప్రజా పత్రిక - శ్రీకాకుళం, ఏప్రిల్ 9 : జిల్లాలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయని, కావున దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతీ ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో కోవిడ్ తో ఒక్క మరణం కూడా సంభవించరాదని, అలా జరిగితే ఉపేక్షించేదిలేదని అధికారులకు తేల్చిచెప్పారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కరోనా సెకెండ్ వేవ్ పై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతీ రోజూ 150 వరకు కేసులు వస్తున్నాయని, ముఖ్యంగా శ్రీకాకుళం , పలాస వంటి పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయని అన్నారు. అందువలన కోవిడ్ పరీక్షలను మరింత విస్తృతం చేయాలని అధికారులను ఆదేశించారు. గతేడాది కోవిడ్ పరీక్షల కొరకు ల్యాబ్ లు ఏర్పాటుచేసుకోవడం జరిగిందని, మరలా సెకెండ్ వేవ్ కరోనాను దృష్టిలో ఉంచుకొని ఆ ల్యాబ్ లను సిద్ధం చేయాలని అన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కిట్లను పంపిందని, గతంలో ఉండే ఆసుపత్రులే ఇపుడు కోవిడ్ ఆసుపత్రులుగా మారబోతున్నాయని కలెక్టర్ స్పష్టం చేసారు. గతంలో మాదిరిగానే కోవిడ్ పేషెంట్ల కొరకు బెడ్స్ సిద్ధం చేయాలని అన్నారు. ప్రస్తుతం రిమ్స్ , జెమ్స్ ఆసుపత్రులలో బెడ్స్ సిద్ధంగా ఉన్నాయని, వీటితో పాటు ప్రైవేటు ఆసుపత్రులలో బెడ్స్ సిద్ధం చేసేందుకు చర్చిస్తున్నామని, ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యం చేయించుకోవాలనుకునే వారికి సహకరించే విధంగా ప్రైవేట్ ఆసుపత్రులు సిద్ధం కానున్నట్లు కలెక్టర్ తెలిపారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్నటువంటి కోవిడ్ పేషెంట్లను ఎప్పటికపుడు పర్యవేక్షిస్తూ, వారికి అంగన్వాడీ సిబ్బంది ద్వారా ఐసోలేషన్ కిట్లను అందజేయాలని అన్నారు. అలాగే ప్రతీ రోజూ ఏ.ఎన్.ఎంల ద్వారా వారి స్థితిగతులు తెలుసుకోవడం వంటి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే పాజిటివ్ కేసులు వచ్చిన వారిని ఆసుపత్రులకు తీసుకువెళ్లేందుకు ప్రత్యేకంగా రవాణా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. కోవిడ్ పేషెంట్లు మరియు ప్రాణపాయ స్థితిలో ఉన్నవారిని ఆసుపత్రులకు తరలించేందుకు ప్రత్యేకంగా 18 అంబులెన్స్ లను సిద్ధం చేయాలని, రెండు మండలాలకు ఒక అంబులెన్స్ తో పాటు మరో పది 108 అంబులెన్స్ వాహనాలను కూడా సిద్ధం చేయాలని, తద్వారా కరోనాలో ఎవరికీ రవాణా సమస్య ఉండబోదని కలెక్టర్ స్పష్టం చేసారు. కేసులు ఎక్కువగా నమోదవుతున్న పట్టణ ప్రాంతాలైన పలాస, రాజాం, సోంపేట వంటి ప్రాంతాల్లో కూడా ఐసోలేషన్ వార్డులను ఏర్పాటుచేసుకొంటూ, ఎవరైతే ప్రాణపాయ స్థితిలో వస్తున్నారో అటువంటివారిని గమనించి వారికి తక్షణ చికిత్సను అందించే దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. దీంతో పాటు టెక్కలి ఏరియా ఆసుపత్రిని కూడా డిస్త్రిక్ట్ కోవిడ్ ఆసుపత్రిగా మార్పుచేసి 40 పడకలను ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. ఇకపై టెక్కలిలో ప్రాణపాయ స్థితిలో ఉన్నటువంటి కేసులను రిమ్స్ కు పంపకుండా టెక్కలి ఆసుపత్రిలోనే వైద్యం చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కేసులు ఎక్కువగా ఉన్నచోట ఆయా ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తూ, కరోనా పరీక్షలను పెంపుచేసి, కంటైన్మెంట్ చేయాలని కలెక్టర్ జిల్లా అధికారులను, మునిసిపల్ కమీషనర్లను, మండలాధికారులను ఆదేశించారు. సెకెండ్ వేవ్ కరోనా త్వరగా వ్యాప్తి చెందుతుందని, గతంలో కరోనాను ఎంత సీరియస్ గా తీసుకున్నారో అదేస్థాయిలో ఇపుడు కూడా సీరియస్ గా తీసుకొని కరోనాను నియంత్రించాలని కలెక్టర్ కోరారు. జిల్లా ప్రజలు, వారి కుటుంబాల ఆరోగ్యమే తమకు ముఖ్యమని, కోవిడ్ వలన ఏ ఒక్కరూ మరణించారనే వార్త రాకూడదని ఆయన తేల్చిచెప్పారు. అలాగే వాలంటీర్ల ద్వారా కోవిడ్ సెకెండ్ వేవ్ పై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని, ప్రతీ ఒక్కరూ కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ కరోనా నుండి రక్షణ పొందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు, సుమిత్ కుమార్, ఐ.టి.డి.ఏ ప్రోజెక్ట్ అధికారి సిహెచ్.శ్రీధర్, జిల్లా అటవీశాఖాధికారి ( టెరిటోరియల్ ) సందీప్, జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి డా. కె.సి.చంద్రనాయక్, అదనపు వైద్యఆరోగ్యశాఖాధికారి డా. బి.జగన్నాథరావు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు బి.శాంతిశ్రీ, జిల్లా నీటియాజమాన్య సంస్థ పథక సంచాలకులు హెచ్.కూర్మనాథ్, జిల్లా ప్రణాళిక అధికారి యం.మోహన్ రావు, గృహ నిర్మాణ సంస్థ పథక సంచాలకులు టి.వేణుగోపాల్, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజినీర్ టి.శ్రీనివాసరావు , ఐసిడిఎస్ పథక సంచాలకులు డా. జి.జయదేవి, నగరపాలక సంస్థ కమీషనర్ , ప్రజా ఆరోగ్య అధికారి ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments