
ప్రజా పత్రిక - శ్రీకాకుళం ,ఏప్రిల్ 9: కోవిడ్ వ్యాక్సిన్ ని ప్రజలు ధైర్యంగా వేసుకోవచ్చని పట్టణ కోవిడ్ ప్రత్యేక అధికారి పి వి ఎస్ ప్రసాద్ కోరారు. బర్మా కాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం వ్యాక్సినేషన్ తీసుకున్న అభ్యర్థులకు ప్రసాద్ అవగాహన కల్పించారు. వ్యాక్సినేషన్ సురక్షితమైనదని ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ కోవిడ్ వైరస్ సోకినప్పటికి ఇప్పటికీ ప్రాణాపాయ పరిస్థితి నుండి కాపాడుతుందని తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న అనంతరం కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలని సూచించారు. వ్యాక్సినేషన్ వలన ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని అయినప్పటికీ శారీరక విశ్రాంతి కొంత కలిగించాలని సూచించారు. వ్యాక్సినేషన్ వలన చిన్నపాటి జ్వరం, తల తిరుగుట, నీరసం వంటి లక్షణాలు కనిపించవచ్చని వాటికి భయపడాల్సిన అవసరం లేదని సూచించారు. వ్యాక్సినేషన్ సమయంలో యాంటిబయాటిక్స్ వాడరాదని ప్రసాద్ తెలిపారు. తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వ్యాక్సిన్ ను వైద్యుల సూచనల మేరకు తీసుకోవాలని ఆయన కోరారు. కోవాక్సిన్, కోవిషీల్డ్ రెండు మంచి వాక్సిన్లని మొదటి డోస్ ఏ వాక్సిన్ వేసుకుంటే రెండవ డోస్ దానినే వేసుకోవాలని ఆయన సూచించారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేసారు.
0 Comments