ప్రజా పత్రిక-శ్రీకాకుళం,జూన్,11ః జిల్లాలో ఉన్న కౌలు రైతులకు పంట సాగు హక్కు పత్రం జారీపై అవగాహన సభలు నిర్వహించనున్నట్లు వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె. శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. భూ యజమాని హక్కులకు ఎటువంటి నష్టం లేకుండా, సాగు చేసే కౌలు రైతులకు పంట సాగు హక్కు పత్రం (సి.సి.ఆర్ .సి) జారీ పై అవగాహన, గ్రామ సభలు తే 11.06.2021 ది నుండి తే 30.06.2021 ది వరకు జరుగుతాయన్నారు. జిల్లాలో సుమారుగా 20-25 % రైతులు ఇతరుల భూమిని సాగుకు తీసుకొని సాగుచేస్తున్నట్లు పేర్కొన్నారు. భూ యజమానికి, కౌలుదారుకి మధ్య ఎటువంటి రాత పూర్వక ఒప్పందం లేకపోవడం వలన బ్యాంకుల నుండి పంట రుణాలు మరియు ఇతర ప్రభుత్వ సబ్సిడీ పథకాల లభ్ది చేకూరని పరిస్థితుల్లో కౌలు రైతులు నష్ట పోతున్నట్లు తెలిపారు. దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం, భూ యాజమానుల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా, వారి హక్కుల రక్షణకు అన్ని ఏర్పాట్లు చేస్తూ, సాగు చేసే రైతులకు “పంట సాగుదారు హక్కు పత్రాలను (సి.సి.ఆర్.సి)” ఫార్మ్ – I (ఆఫ్ ఏక్ట్ నెం.30, 2019) లో జారీ చేస్తూ భరోసానిస్తుందన్నారు. ఈ కార్డు ద్వారా సాగుదారులకు భూమి పై ఎటువంటి హక్కులు లభించవని, కేవలం పంట పై మాత్రమే హక్కు ఉంటుందని, బ్యాంకుల నుండి పంట రుణాలు, పంటల భీమా, పెట్టుబడి రాయితీ, రైతు భరోసా, సున్నావడ్డీ వంటి ప్రభుత్వ పధకాలు సాగుదారు పొందవచ్చునని తెలిపారు. భూ యజమానికి, సాగు చేస్తున్న రైతుకీ మధ్య ఒప్పందాన్ని ఈ కార్డు సూచిస్తుందని దీనిపై భూ యజమాని (లేదా వారి ప్రతినిధి), సాగుదారు, గ్రామ పరిపాలన అధికారి (వి.ఆర్.ఓ లేదా ఆధరైసేడ్ అధికారి) ముగ్గురి సంతకాలు ఉండాలని, ప్రత్యేకంగా మరే పత్రాన్ని భూ యజమాని రాసి ఇవ్వనవసరం లేదన్నారు. పంట సాగుదారు కార్డు కాల పరిమితి కేవలం 11 నెలలు మాత్రమేనని, తర్వాత కొత్త కార్డు పొందవలసి ఉంటుందని ఆప్రకటనలో పేర్కొన్నారు. పంట రుణాలు తప్ప ఇతర వ్యవసాయాభివృద్ధి రుణాలను తమ భూమిపై భూ యజమానులు పొందవచ్చుని పేర్కొన్నారు.
సాగు/కౌలు దారు రైతులకు పంట సాగుదారు హక్కు పత్రాలను (సి.సి ఆర్.సి) ఖరీఫ్/రబీ సీజనుకు జారీ చేయడంలో భాగంగా, ప్రతీ గ్రామం లో సాగు/కౌలు దారు రైతులను గుర్తించడం మరియు కార్డులు జారీ చేయడానికి గ్రామ స్థాయిలో 11.06.2021 నుండి ప్రచార సభలు నిర్వహించడం జరుగుతుందని, దీనిలో భాగంగా ఆయా గ్రామాల్లో అర్హులైన సాగు రైతులు అందరిని గుర్తించి సి.సి.ఆర్.సి కార్డులు జారీ చేయుట జరుగుతుందన్నారు. మండల స్థాయిలో మండల రెవెన్యూ అధికారి మరియు మండల వ్యవసాయ అధికారి; గ్రామ స్థాయిలో గ్రామ రెవెన్యూ అధికారి మరియు గ్రామ వ్యవసాయ సహాయకులు పాల్గొంటారని, గ్రామ వాలంటీర్లు; భూ యజమాని మరియు సాగుదారులను సమన్వయము చేస్తూ పంట సాగుదారు కార్డులు (సి.సి.ఆర్.సి) జారీ కావడానికి సహకరించాలని తెలిపారు. భూ యజమానులు ఎటువంటి సంకోచం లేకుండా మీ సాగుదారుకు సి.సి.ఆర్.సి కార్డు పొందడానికి మీ వంతు సహకారం అందించ వలసిందిగా ఆ ప్రకటనలో ఆయన కోరారు. జిల్లా లోని సాగు/కౌలు దారు రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పంట సాగుదారు హక్కు పత్రాలను (సి.సి ఆర్.సి) పొంది, పంట రుణాలు, ఇతర ప్రభుత్వ పథకాల లబ్ది దారులుగా కాగలరని ఆయన ఆకాంక్షించారు.
0 Comments