శ్రీకాకుళం, జూన్ 9 : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్ధులకు మధ్యాహ్న భోజన పథకం క్రింద విద్యార్ధులకు పంపిణీచేసే డ్రైరేషన్ ను సక్రమంగా పంపిణీచేయాలని సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు విద్యా శాఖాధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం ఆయన బంగ్లాలో డ్రైరేషన్ పంపిణీ కార్యక్రమాన్ని విద్యాశాఖ ఏర్పాటుచేసింది. ఈ కార్యక్రమానికి సంయుక్త కలెక్టర్ హాజరై జిల్లాలో ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూల్స్ వెరశి 3,173 పాఠశాలలు ఉండగా అందులో 2,49,898 మంది విద్యార్ధులు విద్యను అభ్యసిస్తున్నట్లు చెప్పారు. కోవిడ్ కారణంగా పాఠశాలలకు హాజరుకాని విద్యార్ధుల కోసం డ్రైరేషన్ పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. ఇప్పటికే డ్రైరేషన్ క్రింద విద్యార్ధులకు బియ్యం, గ్రుడ్లు, చెక్కీలు పంపిణీచేసిన సంగతిని గుర్తుచేసిన ఆయన మిగిలిన పప్పు ప్యాకెట్లను ప్రస్తుతం పంపిణీచేస్తున్నట్లు చెప్పారు. విద్యార్ధులకు అందించే డ్రైరేషన్ పంపిణీలో కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు ఎటువంటి నిబంధనలు అతిక్రమించకుండా సక్రమంగా పంపిణీచేసే విధంగా నిరంతరం పర్యవేక్షణ చేస్తుండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇన్ ఛార్జ్ జిల్లా విద్యాశాఖాధికారి జి.పగడాలమ్మ, మధ్యాహ్న భోజన పథకం సహాయ సంచాలకులు కె.గంగాభవాని, సమగ్ర శిక్ష ఏ.పి.సి పైడి వెంకటరమణ, జిల్లా పర్యవేక్షకులు పట్నాయక్, సీనియర్ సహాయకులు తుంగాన శరత్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments