శ్రీకాకుళం రూరల్: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయాలనే నిర్ణయం పేదల భవిష్యత్తుకు, వారి వైద్యానికి గొడ్డలిపెట్టు లాంటిదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తీవ్రంగా విమర్శించారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న 'కోటి సంతకాల' సేకరణ, 'రచ్చబండ' కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శ్రీకాకుళం నియోజకవర్గం, రూరల్ మండలం మామిడివలస పంచాయతీ, కిష్టప్పపేట గ్రామంలో సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మాన కృష్ణదాస్, యువ నాయకులు ధర్మాన రామ్ మనోహర్ నాయుడుతో కలిసి పాల్గొన్నారు.
యువతకు పిలుపునిచ్చిన రామ్ మనోహర్:
ఈ సందర్భంగా యువ నాయకులు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు మాట్లాడుతూ పేద విద్యార్థులు డాక్టర్లు కావాలనే మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి సంకల్పాన్ని ప్రస్తుత ప్రభుత్వం నీరుగారుస్తోంది. ప్రభుత్వ కళాశాలల ప్రైవేటీకరణ వల్ల పేద యువతకు అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని యువత, విద్యార్థులు తమ సంతకాల ద్వారా నిరసనగా తెలియజేయాలని కోరారు. జగనన్న సంక్షేమ పాలనను ప్రజలు మర్చిపోలేదని, ప్రతి ఒక్కరూ వైఎస్సార్‌సీపీకి అండగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు.
ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ..ప్రజల ఆరోగ్యం, విద్య వంటి ప్రాథమిక అంశాలపై ప్రభుత్వం వ్యాపార ధోరణి ప్రదర్శించడం దారుణం. గత ప్రభుత్వం పేదలకు వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ సంస్థలను స్థాపించింది. వాటిని ప్రైవేటుపరం చేయకుండా ఆపడానికి మనం ఐక్యంగా పోరాడాలి. ప్రతి వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఇంటింటికీ వెళ్లి, ఈ ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాన్ని ప్రజలకు వివరించి, కోటి సంతకాల సేకరణను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ రచ్చబండ కార్యక్రమంలో శ్రీకాకుళం రూరల్ మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల సభ్యులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
0 Comments