శ్రీకాకుళం, జూన్ 13 : జిల్లాలో పెండింగ్ లో ఉన్న కోవిడ్ రెండవ డోస్ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఆదేశించారు. ఆదివారం సంబంధిత అధికారులతో కోవిడ్ వ్యాక్సినేషన్, కోవిడ్ పరీక్షలపై నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో కలెక్టర్ మాట్లాడుతూ శనివారం కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని కొన్ని మండలాల్లో పరిశీలించామని అన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం అనుకున్న స్థాయిలో కొన్ని చోట్ల జరగడం లేదని ఆయన పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అంకితభావంతో చేపట్టాలని సూచించారు. హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లు రెండవ డోసు తీసుకోవాల్సిన వారు ఇంకా 13 శాతం, 45 సంవత్సరాల వయసు దాటిన వారు 40 శాతం వరకు ఉన్నారని ఆయన తెలిపారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో రెండవ డోసు వేసుకోవలసిన వారికి ప్రాధాన్యతనిచ్చి వారందరికీ శత శాతం వ్యాక్సినేషన్ చేయాలని ఆయన ఆదేశించారు. హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 45 సంవత్సరాలు దాటిన వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి చేయడం వలన ప్రభుత్వం తదుపరి సూచనల మేరకు ఇతర కేటగిరీల వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టుటకు అనువుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా రెండవ డోస్ ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్ ఉండరాదని ఆయన స్పష్టం చేశారు. ఐదు సంవత్సరాల వయస్సు లోపు గల చిన్నారుల తల్లులకు, 45 సంవత్సరాల వయసు దాటిన వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సోమవారం నుండి విస్తృతం చేయాలని, అవసరమైతే గ్రామ స్థాయి వరకు తీసుకువెళ్లి వాక్సినేషన్ చేయాలని ఆయన చెప్పారు.
జిల్లాలో కరోనా పరీక్షలు ఎక్కువగా చేయాలని కలెక్టర్ శ్రీకేష్ స్పష్టం చేశారు. జిల్లాలో నమూనాల సేకరణకు అవసరమైన కిట్లు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొంటూ ఆ మేరకు పరీక్షలు నిర్వహించి ల్యాబ్ ల సామర్థ్యాన్ని వినియోగించుకోవాలని ఆయన చెప్పారు. మూడవ దశ కరోనా రాకుండా ఆపాలని అందుకు అధికారులు, వైద్యులు, సిబ్బంది ప్రస్తుతం చేస్తున్న విధులను స్ఫూర్తిదాయకంగా చేయాలని ఆయన కోరారు. జిల్లాలో ఆక్సిజన్ స్వయం సమృద్ధి సాధించడానికి ప్రయత్నిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. అనుకోని పరిస్థితులలో ఇతర ప్రాంతాల నుంచి ఆక్సిజన్ సరఫరా లేనప్పటికీ జిల్లాలో ఎటువంటి కొరత రాకుండా ఉండాలని అందుకు తగిన విధంగా చర్యలు చేపదుతున్నామని ఆయన చెప్పారు.
జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె. శ్రీనివాసులు మాట్లాడుతూ హోం ఐసోలేషన్ లో ఉన్న వారిని పరిశీలించాలని, హోమ్ కిట్లను ప్రతి ఒక్కరికి అందించాలని పేర్కొన్నారు. కాంటాక్ట్ ట్రేసింగ్ పక్కాగా నిర్వహించాలని సూచించారు.
ఈ టెలీ కాన్ఫరెన్స్ లో మండల ప్రత్యేక అధికారులు, మండల అధికారులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments