ప్రజా పత్రిక-శ్రీకాకుళం:కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు ఉధృతం చేస్తామని రైతు, కార్మిక సంఘాల నాయకులు డి.గోవిందరావు, కె.మోహనరావు, పి.తేజేశ్వరరావు,చాపర.సుందరలాల్ జి.సింహాచలం హెచ్చరించారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక మూడు వ్యవసాయ నల్ల చట్టాలు తెచ్చి సంవత్సరం అయిన సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు శ్రీకాకుళం డే&నైట్ జంక్షన్ లో రైతు కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో నూతన వ్యవసాయ చట్టాల ప్రతులను రైతు కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో దగ్ధం చేసారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ
కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను దుర్మార్గంగా అమలు చేస్తున్నదని విమర్శించారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం దూకుడుగా కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నదని విమర్శించారు. 3 రైతు వ్యతిరేక చట్టాలు, విద్యుత్ సవరణ చట్టాన్ని పార్లమెంట్ మూజువాణి ఓటుతో ఆమోదించిందని అన్నారు. రైతాంగ చట్టాలకు వ్యతిరేకంగా నవంబరు 26 నుండి 500 రైతు సంఘాలు టిక్రి, ఘాజిపూర్, సింఘ్ కేంద్రాలుగా ఢిల్లీ పరిసరాల్లో జరుగుతున్న మహత్తర పోరాటం యావత్తు దేశానికి స్ఫూర్తినిస్తున్నదని అన్నారు. గత వంద సంవత్సరాలలో ప్రపంచలోనే అతి పెద్ద శాంతియుత పోరాటం అని అన్నారు. దేశానికే అన్నం పెట్టే అన్నదాతలు, రైతాంగం, వ్యవసాయ కార్మికులు, కౌలుదారుల కష్టాలు నానాటికి పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. వ్యవసాయ ఉత్పత్తికి అవసరమైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు వగైరాల ధరలు పెరగడం వల్ల వ్యవసాయం ఖర్చు బాగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వ బ్యాంకుల నుంచి ఇచ్చే వ్యవసాయ రుణాలు తగ్గాయి. దాంతో రైతులు రుణాల కోసం (80 శాతం) ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల మీదే ఆధారపడాల్సి వస్తున్నది. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక వడ్డీల భారాలు చెల్లించలేక దేశవ్యాప్తంగా గత 15 సంవత్సరాలలో 3 లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కేంద్రంలో బిజెపి అధికారం లోకి వచ్చిన తర్వాత గతంలో వున్న ఎరువుల సబ్సిడీలు తగ్గించారు. అన్నింటిని మించి మూడు రైతు చట్టాలను బలవంతంగా రైతులపై రుద్దాలని బిజెపి ప్రభుత్వం నిర్ణయించింది. కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని బహిరంగంగా ప్రధానమంత్రి ప్రకటించారు. వ్యవసాయ రంగంలో తెచ్చిన మూడు చట్టాల వల్ల రైతుల పంటలకు ఇప్పుడు కనీస మద్దతు ధర కూడా లేకుండా పోతుంది. మార్కెట్లు, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు మూసివేస్తారు వ్యవసాయం మొత్తం కార్పొరేట్ కంపెనీల వశమవుతుంది. ప్రజలకు ఆహారభద్రత లేకుండా పోతుంది. దేశంలోని 500 రైతు సంఘాల ఏకమై ఈ చట్టాల రద్దు కోసం పోరాడుతున్నాయి. రైతు ఉద్యమాన్ని అణచడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తోంది. రైతులను విదేశీ ఏజెంట్లు, తీవ్రవాదులని ముద్రవేసే ప్రయత్నం చేసింది.దీక్షా శిబిరాల చుట్టూ ముళ్ళ కంచెలు వేయడం, గోడలు నిర్మించడం, కందకాలు తవ్వించడం, మేకులు కొట్టించడం, మంచినీరు, విద్యుత్ సరఫరా నిలిపివేయడం, టెలిఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్లు తీసివేయడం, ఆర్ఎస్ఎస్, బిజెపి గ్యాంగులను ఉసిగొల్పడం వంటి దుశ్చర్యలకు మోడీ ప్రభుత్వం పాల్పడింది. అయినా రైతు ఉద్యమం సడలలేదు. మరింత ఊపందుకుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని అణచివేత చర్యలను, విభజన వ్యూహాలను ప్రయోగించినప్పటికీ, భారీ వర్షాలు, ఎముకలు కొరికే చలి, అగ్ని కణాలను వెదజల్లే వేసవి వేడి ఉన్నప్పటికీ రైతు ఉద్యమం పెరుగుతోందని, డిమాండ్ల సాధనకు గట్టిగా నిలుస్తుంది.'' అని పేర్కొన్నారు. మోడీ అనుసరిస్తున్న విధానాల వల్లే కరోనా దేశాన్ని కబలిస్తోందని తెలిపారు. ప్రజలు కరోనా కష్టకాలంలో ఉంటే ఆదుకోవాల్సిన కేంద్ర బిజెపి ప్రభుత్వం ఆ పని చేయకుండా ప్రజాధనంతో నిర్మించిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, రైల్వే, ఎల్.ఐ.సి, బ్యాంకులు, టెలికాం, పోర్టులు, బొగ్గు గనులు, ఇస్రో, రక్షణ రంగం వంటి ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.మోహనరావు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.గోవిందరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు,
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఈశ్వరమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి గంగరాపు.సింహాచలం,రైతు కూలీ సంఘము జిల్లా నాయకులు ఎస్.కృష్ణవేణి, కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోలాకి.ప్రసాదరావు,
ఎఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షులు చిక్కాల.గోవిందరావు,చాపర. సుందరలాల్, ఎల్.వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.
0 Comments