ప్రజా పత్రిక-ఎచ్చెర్ల: పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని లేకుంటే పోరాటాలు ఉధృతం చేస్తామని సిపిఎం జిల్లా నాయకులు డి.గోవిందరావు,సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు పెంపుదలకు నిరసనగా సోమవారం సిపిఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో ఎచ్చెర్లలో ట్రక్కుని తాళ్లతో కట్టి లాగుతూ వినూత్నంగా నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో పెట్రోల్ ధరలు మే నెలలో 18 సార్లు పెంచటం అమానుషమని అన్నారు. కరోనా కష్టాల్లో ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన కేంద్ర బిజెపి ప్రభుత్వం పెట్రోలు ధరల పెంపు చేయడం శోచనీయమని విమర్శించారు. ఒక వైపున ఆక్సిజన్ కొరత, అంబులెన్సులు, మందులు, ఆసుపత్రిలో బెడ్లు, అన్నిటికీ కొరతగా ఉన్న ఈ తరుణంలో ప్రజల ప్రాణాలతో కేంద్ర బిజెపి ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని విమర్శించారు. కరోనా మొదటి దశలోనూ విపరీతంగా పెట్రోల్ ధరలను పెంచిందని అన్నారు. పెట్రోల్ ధరలు పెంచటం ద్వారా దేశప్రజల సొమ్ముని బిజెపి ప్రభుత్వం లూటి చేస్తోందని ఆరోపించారు. ఎక్సైజ్ డ్యూటీ సెస్లు, అదనపు సెస్లు విధిస్తూ లక్షల కోట్ల రూపాయలను తన ఖజానాలో వేసుకుని కార్పొరేట్లకు రాయితీల రూపంలో కట్టబెడుతుందని విమర్శించారు. అసలు పెట్రోల్ ధర 35రూ ఉండగా, 65రూపాయల పైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల రూపంలో భారం వేయడం తగదు, ఈస్థాయిలో పన్నులు ప్రపంచంలో ఎక్కడా లేవని తెలిపారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినప్పుడు కూడా పెట్రోల్ ధరలు తగ్గించ కుండా ధరలు పెంచటం మోసపూరితమని తెలిపారు.ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వరకు పెట్రోల్ ధర పెంచకుండా, ముగిసిన కొద్ది రోజుల నుండి వరుసగా పెట్రోల్ ధరలు పెంచటం ప్రజలను మోసగించడమేనని అన్నారు. పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల ద్వారా నూనెలు, పప్పులు తదితర నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి ప్రజలు జీవనం కష్టంగా మారిందని అన్నారు. ఒకవైపు కరోనా కష్టకాలంలో ప్రజలు అల్లాడుతుంటే పెట్రోల్ ధరలు పెంచడమేమిటని ప్రశ్నించారు. వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎన్.వి.రమణ,సీఐటీయూ జిల్లా కార్యదర్శి కె.గురునాయుడు,ఎచ్చెర్ల మండల నాయకులు డి.బంగార్రాజు, టి.రామారావు,బి.రాము,జి.శ్రీనివాసరావు, గోవింద తదితరులు పాల్గొన్నారు.
0 Comments