ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

రాహుల్‌కు 'చిరు' కోరిక‌.. సాధ్య‌మేనా?

*రాహుల్‌కు 'చిరు' కోరిక‌.. సాధ్య‌మేనా?*

కాంగ్రెస్ పార్టీ ఈసారి గ‌ట్టిగా ట్రై చేయాల‌నుకుంటోంది. రాహుల్‌గాంధీని ఎలాగైనా ప్ర‌ధానిని చేయాల‌ని ప్ర‌శాంత్ కిశోర్ ఇంకా గ‌ట్టిగా ట్రై చేస్తున్నారు. యువ‌రాజు మాత్రం ప్రస్తుతం ట్విటర్‌కే ప‌రిమిత‌మ‌వుతున్నారు. మోదీపై త‌న స్టైల్‌లో సెటైర్లు వేస్తున్నారు. అయితే.. దేశంలో మోదీ గ్రాఫ్ దారుణంగా ప‌త‌న‌మ‌వుతుండ‌టంతో కాంగ్రెస్‌కు మ‌ళ్లీ క్రేజ్ పెరుగుతోంది. తృణ‌మూల్‌, డీఎంకే, ఎన్సీపీలాంటి బీజేపీ వ్య‌తిరేఖ ప్రాంతీయ పార్టీల‌కు హ‌స్తం పార్టీయే ఆశాకిర‌ణంగా క‌నిపిస్తోంది. ఇక ద‌క్షిణాదిన క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌లో డీకే శివ‌కుమార్‌, రేవంత్‌రెడ్డిలాంటి బ‌ల‌మైన పీసీసీ చీఫ్‌లు ఉండ‌టంతో ఈసారి ఎన్నిక‌ల్లో ఈ రెండు రాష్ట్రాల్లో మెరుగైన ఫ‌లితాలు వ‌స్తాయ‌ని ధీమాగా ఉన్నారు. త‌మిళ‌నాడులో ఎలాగూ డీఎంకేతో పొత్తు ఉండ‌నే ఉంది. కేరళ‌లో కాంగ్రెస్ బ‌లంగా ఉండ‌టంతో పాటు సాక్షాత్ రాహుల్‌గాంధీనే అక్క‌డ ఎంపీగా ఉన్నారు. ఇలా ఒక్క ఆంధ్ర‌ప్ర‌దేశ్ మిన‌హా ద‌క్షిణాదిలో కాంగ్రెస్ పార్టీకి అన్నీ శుభ‌శ‌కునాలే. 

అందుకే, రాహుల్‌గాంధీ ఏపీపై ఇప్పుడిప్పుడే ఫోక‌స్ పెంచార‌ని అంటున్నారు. వైఎస్సార్ హ‌యాంలో గ‌త‌మెంతో ఘ‌న‌మైన ఏపీ కాంగ్రెస్‌.. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత అడ్ర‌స్ లేకుండా పోయింది. హ‌స్తం ఖాతాలో ఓ వార్డు మెంబ‌ర్ కూడా లేని దుస్థితి. కాంగ్రెస్ పేరు పెట్టుకొని.. కాంగ్రెస్‌ నేత‌ల‌ను కూడ‌గ‌ట్టుకొని.. వేరుకుంప‌టి పెట్టుకొని.. అధికారం చెలాయిస్తున్న జ‌గ‌న్‌ను ఎలాగైనా దెబ్బ‌కొట్టాల‌నే క‌సితో స‌రైన‌ స‌మ‌యం కోసం ఎదురుచూస్తోంది హ‌స్తం పార్టీ. కుదిరితే, జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దై జైలుకెళితే.. మ‌ళ్లీ ఏపీలో బ‌ల‌ప‌డాల‌నే దిశ‌గా ఇప్పుడిప్పుడే ఆలోచ‌న చేస్తోంద‌ట‌. కుద‌ర‌క‌పోతే, వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే.. జ‌గ‌న్‌ను మ‌రోసారి జైల్లో పెట్ట‌డం ఖాయ‌మంటున్నారు. జ‌గ‌న్ జైలుకెళ్లి.. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే.. వైసీపీలో ఉన్న పాత కాపులంద‌రినీ తిరిగి హ‌స్తం గూటికి చేర్చ‌డం ఏమంత క‌ష్ట‌మైన ప‌ని కాదంటోంది అధిష్టానం.

ఇప్పుడైనా, ఎప్పుడైనా.. ఏపీలో కాంగ్రెస్ మ‌ళ్లీ బ‌ల‌ప‌డాలంటే వైఎస్సార్‌లా ఫేస్ వ్యాల్యూ ఉన్న బ‌ల‌మైన నాయ‌కుడి అవ‌స‌రం ఉంద‌నే భావ‌న‌లో రాహుల్ గాంధీ ఉన్నార‌ని తెలుస్తోంది. మాజీ సీఎం కిర‌ణ్‌కుమార్‌రెడ్డి అంత ఛ‌రిస్మా లేక‌పోవ‌డంతో.. రాహుల్ ఆలోచ‌న అంతా చిరంజీవి చుట్టే తిరుగుతోంద‌ని అంటున్నారు. చిరు మిన‌హా మ‌రెవ‌రూ రాహుల్ కంటికి ఆన‌డం లేద‌ట‌. ఇటీవ‌ల‌, ఏపీ కాంగ్రెస్ వ్వ‌వ‌హారాల ఇంఛార్జి ఉమెన్ చాందీతో ఆ మేర‌కు రాహుల్ చ‌ర్చించార‌ని తెలుస్తోంది. ఓ సారి చిరంజీవితో మాట్లాడ‌మంటూ ఉమెన్ చాందీని రాహుల్ పుర‌మాయించార‌ని చెబుతున్నారు. అన్నీ కుదిరితే త్వ‌ర‌లోనే వారిద్ద‌రి భేటీ ఉంటుంద‌ని అంటున్నారు. 


ప్ర‌జారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసి.. రాజ్య‌స‌భ సీటు సాధించి.. కేంద్ర‌మంత్రిగా చేసిన చిరంజీవి.. ప్ర‌స్తుతం రాజ‌కీయంగా యాక్టివ్‌గా లేక‌పోయినా.. టెక్నిక‌ల్‌గా కాంగ్రెస్‌లోనే ఉన్నారు. కాంగ్రెస్ అవ‌స‌రాల దృష్ట్యా మ‌ళ్లీ ఆయ‌న్ను యాక్టివ్ చేయాల‌ని రాహుల్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అవ‌స‌ర‌మైతే చిరంజీవికి ఏపీ పీసీసీ ప‌గ్గాలు అప్ప‌గించేందుకూ సిద్దంగా ఉన్నార‌ట‌. 

రాహుల్‌గాంధీ కోరిక ఎలా ఉన్నా.. ఆయ‌న పిలిచినంత మాత్రాన చిరంజీవి కాంగ్రెస్‌లో యాక్టివ్ అవుతారా అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్‌. ప్ర‌స్తుతం సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్న చిరు.. రాజ‌కీయంగానూ కాస్తోకూస్తో ఉనికి చాటుతున్నారు. ఇటు త‌మ్ముడుకి, జ‌న‌సేన‌కి తెర‌వెనుక నుంచి మోర‌ల్ స‌పోర్ట్ ఇస్తున్నారు. అటు జ‌గ‌న్‌తోనూ టాలీవుడ్ స‌మ‌స్య‌ల సాకుతో ట‌చ్‌లో ఉంటున్నారు. ఒక ద‌శ‌లో చిరంజీవిని వైసీపీ త‌ర‌ఫున రాజ్య‌స‌భ‌కు పంపిస్తార‌నే టాక్ కూడా విన‌బ‌డింది. సో, ఈ కేంద్ర‌ మాజీ మంత్రికి రాజ‌కీయ వాస‌న‌లు ఇంకా పోలేద‌నే చెప్పాలి. కేంద్రంలో ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే.. మున‌ప‌టిలా చిరంజీవిని సంతృప్తి ప‌రిచే ప‌ద‌వి ఇస్తానంటే.. చిరు మ‌ళ్లీ కాంగ్రెస్ బాధ్య‌త‌లు స్వీక‌రించినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదంటున్నారు. రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మే అంటారుగా.. ఏమో.. గుర్రం ఎగ‌రావ‌చ్చు

Post a Comment

0 Comments