మండల కేంద్రంలోని సచివాలయాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు అందిస్తున్న సేవలు, సచివాలయ సిబ్బంది పనితీరు, సిబ్బంది హాజరు పట్టి, ఇతర రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సిటిజన్ చార్టర్ గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎన్ని పరిష్కరించారని రికార్డులు పరిశీలించారు. వైయస్సార్ పెన్షన్ కానుకకు ఇంకా ఎంత మంది దరఖాస్తులు చేసుకున్నారని, వాటిని తిరస్కరించడానికి కారణాలు ఏమిటని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన అన్ని సేవలూ నిర్దేశిత సమయంలో అందించాలని సూచించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాను విధిగా నోటీస్ బోర్డులో ఉంచాలన్నారు. పని తీరు విషయంలో అలసత్వం వహించొద్దని, జవాబుదారితనం ఉండాలని ఆదేశించారు. అర్హులకు సంక్షేమ పథకాలను చేరువ చేయాలన్నారు. గ్రామ స్వరాజ్యం సాధించడానికి సచివాలయ సిబ్బంది పూర్తి నిబద్ధతతో పని చేయాల్సి ఉంటుందన్నారు. సిబ్బంది పనితీరు పట్ల కృష్ణదాస్ సంతృప్తిని వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న సచివాలయం రిజిస్టర్లో సంతకం చేశారు.
0 Comments