శ్రీకాకుళం, జనవరి 5 : రైతులు రైతు భరోసా కేంద్రాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లాలే తప్పా మిల్లర్లను ఆశ్రయించరాదని, ఆ విధంగా రైతులకు అవగాహన కల్పించాలని ఏ.పి.మార్క్ ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పి.ఎస్.ప్రద్యుమ్న స్పష్టం చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం గార మండలం నిజామాబాద్, జలుమూరు మండలం పాగోడు రైతు భరోసా కేంద్రాలను ఆయన ఆకస్మిక తనికీ చేశారు. రైతుకు అన్నివిధాల లబ్దిచేకూర్చాలన్నదే సిఎం ఆశయమని, ఆ దిశగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని, అందుకు తగిన విధంగా గ్రామ వ్యవసాయ సహాయకులు, టెక్నికల్ సిబ్బంది పనిచేయాలని ఆదేశించారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, పిపిసి టెక్నికల్ సిబ్బందే తమ కల్లాల వద్దకు వెళ్లిమ పరీక్షలు నిర్వహించాల్సి ఉందని చెప్పారు. పి.పి.సిలకు తీసుకువెళ్లాల్సిన తేదీ, సమయం కేటాయించిన ట్రక్ షీట్ తో పాటు ధాన్యం కొనుగోలు ధరను కూడా రైతులకు తెలియజేయాలన్నారు. ఈ విషయాన్ని జిల్లాలోని అన్ని పిపిసిలకు సర్క్యూలర్ జారీచేయాలని ఎం.డి ఆదేశించారు. రైతులకు అవసరమైన రవాణా, గన్నీబ్యాగులు సమకూర్చవలసిన బాధ్యత ఆర్.బి.కెలపై ఉందని తెలిపారు. స్వంత రవాణా, గన్నీబ్యాగులను ఏర్పాటుచేసుకున్న రైతులకు వాటికి సంబంధించిన చెల్లింపులను నేరుగా వారి ఖాతాలకే జమచేయడం జరుగుతుందని అన్నారు. మిల్లర్లు రైతుల నుండి స్వయంగా కొనుగోలు చేస్తే అటువంటి వాటికి చెల్లింపులను నిలుపుదల చేయాలని ఎం.డి అధికారులను ఆదేశించారు. తేమ శాతం 17కంటే ఎక్కువగా ఉంటే ఆరబెట్టిన తదుపరి కొనుగోలు చేయాల్సి ఉందని, ఇందుకు తగిన స్థలాన్ని సూచించాలని చెప్పారు. ప్రతీ కేంద్రంలో ధాన్యం కొనుగోలుకు సంబంధించిన గోనె సంచులు, రవాణా సిద్ధంగా ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు అవసరమైన గదులను ఏర్పాటుచేసుకోవాలని అన్నారు. రైతులు దళారీలను, మధ్యవర్తులను నమ్మిమోసపోకుండా చూడాలని చెప్పారు.
తొలుత గార మండలం నిజామాబాద్ రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించిన ఆయన అక్కడ రైతులకు ఇచ్చే కూపన్ విధానాన్ని స్వయంగా పరిశీలించారు. నిజామాబాద్ గ్రామ పరిధిలో 241 మంది రైతులు ఉండగా 115 మందికి షెడ్యూల్ ఇవ్వడం పట్ల ఆరాతీసారు. ధాన్యం కొనుగోలును మరింత వేగవంతం చేయాలని పేర్కొన్నారు. కేటాయించిన లక్ష్యాల మేరకు 658 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని, కాని ఇప్పటివరకు 49 మంది రైతుల నుండి 71 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడంపై గ్రామ వ్యవసాయ అధికారి ఎన్.లోకేశ్వరరావును అడిగి తెలుసుకున్నారు. రైతులు ముందుకు వచ్చేవిధంగా వారికి అవగాహన కల్పించాలన్నారు. తదుపరి జలుమూరు మండలం పాగోడు రైతు భరోసా కేంద్రాన్నితనిఖీ చేసిన ఎం.డి అక్కడ ప్రభుత్వం కేటాయించిన యాప్ ద్వారా చేపడతున్న కార్యక్రమాలను స్వయంగా పరిశీలించారు. కొందరు రైతులు మిల్లర్లను ఆశ్రయించడం పట్ల వివరాలు తెలుసుకున్న ఎండి అవగాహన లేమితో రైతులు ఆశ్రయిస్తున్నారని, వారికి ఫ్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను వివరించాలని, మిల్లర్లు స్వయంగా రైతుల నుండి కొనుగోలు చేస్తే చెల్లింపులు చేయబోమని స్పష్టం చేసారు.
ఈ పర్యటనలో సంయుక్త కలెక్టర్ యం.విజయసునీత, రెవిన్యూ డివిజనల్ అధికారి ఐ.కిశోర్, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ పి.జయంతి, ఏ.పి.మార్కెఫెడ్ జిల్లా మేనేజర్ కె.యు.పి.రమణి, జిల్లా సరఫరాల అధికారి డి.వి.రమణ, మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు బి.శ్రీనివాసరావు, శ్రీకాకుళం, గార తహశీల్ధారు వెంకటరావు, జె.రామారావు, ఏ.ఓ ఉషారాణి, సిఎస్డిటిలు శారదాదేవి, నిజామాబాద్, పాగోడు గ్రామ వ్యవసాయ సహాయకులు నక్క లోకేశ్వరరావు, చింత అశోక్ కుమార్, రైతులు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments