శ్రీకాకుళం, ఫిబ్రవరి 14 : జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో నూతనంగా ప్రవేశపెట్టిన టి.సి.ఎస్ సాఫ్ట్ వేర్ ద్వారా ఖాతాదారులకు మరిన్ని మెరుగైన సేవలను నేటి నుండి అందించనున్నట్లు ఆ బ్యాంకు ఛైర్మన్ కరిమి రాజేశ్వరరావు వెల్లడించారు. సోమవారం దండివీధిలో గల జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో డి.సి.సి.బిలో నూతనంగా ప్రవేశపెట్టిన టి.సి.ఎస్ సాఫ్ట్ వేర్ ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ పాత్రికేయులతో మాట్లాడుతూ డిసిసిబిలో ప్రస్తుతమున్న సాఫ్ట్ వేర్ నుండి అడ్వాన్సుడు సాఫ్ట్ వేర్ అయిన టి.సి.ఎస్ నకు మారుతుందని అన్నారు. తద్వారా ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులతో సమానంగా అన్ని రకాల లావాదేవీలు జరగనున్నట్లు ఆయన తెలిపారు. గతంలో వినియోగదారుల సేవల్లో కొంత వెనుకంజలో ఉండేదని, దాన్ని అధిగమించేందుకు కొత్త సాఫ్ట్ వేర్ ను అందుబాటులోకి తెచ్చామని, ఈ సాఫ్ట్ వేర్ తో అన్ని వర్గాల వారికి మరిన్ని మెరుగైన సేవలు అందించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోనే 5వ బ్రాంచ్ గా డి.సి.సి.బి ఆన్ లైన్ సేవల్లోకి రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ సాఫ్ట్ వేర్ ద్వారా ఐఎంపిఎస్, యుపిఎఐ సేవలతో పాటు గూగుల్ పే, ఫోన్ పే, మొబైల్ బ్యాంకింగ్ సేవలు, ఆధార్ ఆధారిత చెల్లింపు విధానం వంటి అన్ని రకాల లావాదేవీలను ఎస్.యం.ఎస్ రూపంలో ఖాతాదారులకు అందించడం జరుగుతుందని వివరించారు. ఇతర బ్యాంకుల కన్నా 5% తక్కువ ప్రోసెసింగ్ ఛార్జీలతో అన్నిరకాల సేవలు అందించనున్నట్లు చెప్పారు. జిల్లాలో 21 ఏ.టి.ఎంలు, 2 మొబైల్ ఏ.టి.ఎంలు ఉన్నాయని, కొత్తగా మరో 12 బ్రాంచులను ఏర్పాటుచేసేందుకు ప్రతిపాదించడం జరిగిందని తెలిపారు. నూతన సాఫ్ట వేర్ ద్వారా జిల్లాలోని ఇతర బ్రాంచిలకు ఖాతాలను బదలాయింపు చేసుకోవచ్చని, ఇకపై అన్ని రకాల ఆర్ధిక లావాదేవీలు చాలా సులభంగా జరుపుకోవచ్చని స్పష్టం చేసారు. ఎన్.ఈ.ఎఫ్.టి, ఆర్.టి.జి.ఎస్, డి.బి.టి, ఏ.టి.ఎం కార్డులు మొదలైన ఆన్ లైన్ సేవలన్నీ అత్యంత వేగంగా సెటిల్ అవుతాయని పేర్కొన్నారు. ఇతర బ్యాంకుల కంటే జిల్లా సహకార బ్యాంకు ద్వారా అతి తక్కువ వడ్డీలకే అన్ని రకాల రుణాలను అందించబడతాయని, వ్యాపార దృష్టితో కాకుండా ఖాతాదారుల సేవలే ముఖ్యంగా బ్యాంకు పనిచేయనుందని తెలిపారు. రైతులకు లక్ష రూపాయల వరకు జీరో వడ్డీతో రుణాలను అందిస్తామని, గోల్డ్ లోన్ 7% వడ్డీతో గ్రాముకు రూ.3,300/-ల వరకు మంజూరుచేస్తామని అన్నారు. ఎస్.హెచ్.జి గ్రూపులకు రూ.3లక్షల వరకు 0.58 పైసల వడ్డీ, ఆ పైబడిన రుణాలకు 9% వడ్డీతో అందిస్తామన్నారు. అలాగే గృహ నిర్మాణం, మరామ్మతులకు 8% వడ్డీతో రూ.40 లక్షల వరకు , వాహన కొనుగోలుకు 8%, విద్యారుణాలను 9% వడ్డీతో రుణాలను మంజూరుచేయనున్నట్లు వివరించారు. రైతులకు వ్యవసాయ భూములపై అతి తక్కువ వడ్డీకి ఋణ నదుపాయాన్ని కల్పిస్తామని తెలిపారు. డిపాజిట్లపై అత్యధికంగా 6.50%, సీనియర్ సిటిజన్లకు 7% వడ్డీని చెల్లిస్తామని, కేవలం రూ. 1000/-లు సంవత్సరానికి అద్దెపై లాకరు సదుపాయం బ్రాంచీల ద్వారా అందించబడుతుందని చెప్పారు. 2022 జనవరి మాసాంతానికి బ్యాంకు యొక్క వ్యాపారం రూ.1680 కోట్లు కాగా, అందులో రూ.411 కోట్లు డిపాజిట్లు, రూ.1194 కోట్లు రుణాలుగా ఉందని తెలిపారు. పంట రుణాల లక్ష్యం మార్చి 2022 నాటికి రూ.727 కోట్లుగా నిర్ణయించుకోగా జనవరి మాసాంతానికి రూ.670 కోట్లు మంజూరు చేయడమైందని తెలిపారు. ఈ నెల 14 నుండి 21 వరకు డిజిటల్ లిటరరీ అవగాహన వారోత్సవాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. సి.సి.ఎల్లో గల రైతులు 4% వడ్డీ చెల్లించి వారి యొక్క పంట రుణాలు రెన్యూవల్ చేసుకోవాలని ఛైర్మన్ ఈ సందర్భంగా రైతులకు పిలుపునిచ్చారు. డిసిసిబి అందిస్తున్న ఈ సేవలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. టి.సి.ఎస్ సాఫ్ట్ వేర్ రూపకర్త సంజీవను చైర్మన్ ఈ సందర్భంగా అభినందించారు.
ఈ సమావేశంలో డిసిసిబి డైరక్టర్లు బంకి లక్ష్మణమూర్తి, గొండు నిర్మలమ్మ, ఆప్కో బిజిఎం కె.మస్తాన్ రావు, డిజిఎం బి.శ్యామ్ ప్రసాద్, సిఐఓ పూర్ణా రెడ్డి, సిఇఓ పి.జ్యోతిర్మయి, డిసిసిబి జనరల్ మేనేజర్ డి.వరప్రసాద్, డిజిఎంలు యస్.వి.యస్.జగదీష్, యస్.వి.సత్యనారాయణ, జి.సునీల్, ఎ.జి.ఎంలు సిహెచ్.బసవ లింగం, జి.రామకృష్ణ, బి.దశరధరావు , పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments