రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత కల్పించే దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని, వాటికి సమృద్ధిగా నిధులు కేటాయిస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. శనివారం నరసన్నపేట నియోజకవర్గం లోని సారవ కోట మండలం చిన్న కిట్టాలపాడు గ్రామంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. అంతకుముందు ఆయన రైతు భరోసా కేంద్రాన్ని, రహదారుల మరమ్మత్తుల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత కల్పించామని, నరసన్నపేట నియోజకవర్గంలో 9 ప్రధానమైన 47 కిమీ మేర రహదారులకు రూ.12.25 కోట్లు కేటాయించామన్నారు. జిల్లాలో 70 శాతం మంది ప్రజలు ప్రధానంగా వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారని, రైతులు విజ్ఞతతో ఆలోచించి పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలని అన్నారు. ప్రభుత్వం నుంచి వీరికి ప్రోత్సాహకాలు ఉంటాయని స్పష్టం చేశారు. ఖరీఫ్లో వరి పంట వైపు మొగ్గు చూపాలని రబీలో మాత్రం వాణిజ్య పంటల వైపు దృష్టి సారించ గలగితే ఆర్థిక అభివృద్ధి సాధించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ పిరియ విజయ సాయిరాజ్, డిసిసిబి అధ్యక్షులు కరిమి రాజేశ్వరరావు, యువ నాయకులు, పోలాకి జడ్పీటీసీ డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య, సారవకోట జెడ్పిటిసి సభ్యురాలు వరుదు నాగేశ్వరమ్మ, ఎంపీపీ చిన్నాల కూర్మి నాయుడు, సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments