శ్రీకాకుళం, ఆగస్ట్ 29 : ఆగస్ట్ 28న ఉదయం 4.00 గం.ల ప్రాంతంలో జి. సిగడాం మండలం బాతువ సమీపంలో రెండు ఎర్ర చందనము చెట్లను అక్రమముగా నరికివేసినట్లు సమాచారం అందిందని
జిల్లా ఆటవీ శాఖాధికారి జి.జి.నరేంద్రన్ తెలిపారు.
ఎర్ర చందనం అక్రమ నరికివేతపై ఆయన కార్యాలయంలో పాత్రికేయుల సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బాతువ సమీపంలో అక్రమంగా నరికివేయబడిన ఎర్ర చందనం విషయమై తక్షణమే శ్రీకాకుళం అటవీ పరిధి అధికారి జి.
జగదీశ్వరరావును ఆదేశించడం జరిగిందని, ఆయన
రణస్థలం, కుప్పిలి ఉప అటవీ క్షేత్రాదికారులు ఆర్.అప్పలనాయుడు, ఎన్.శ్రీనివాసరావులతో బృందంగా కలసి బాతువ గ్రామ సమీపములో గల కాలువ గట్టు ప్రక్కన గల వరదా సత్యనారాయణ నకు చెందిన సర్వే నెంబర్ 368కు చెందిన మామిడి తోటలో అక్రమంగా నరికి వేయబడిన రెండు ఎర్ర చందనం చెట్లను గుర్తించడం జరిగిందని చెప్పారు. తదుపరి సమీప ప్రాంతాల్లో కూడా సిబ్బంది కూంబింగ్ నిర్వహించగా ఆ ప్రాంతంతో పాటు సుమారు 500 మీటర్ల దూరములో కూనబెల్లి సూర్యనారాయణకు చెందిన సర్వే నెంబర్ 387కు చెందిన జీడి మామిడి తోటలో బెరడు తొలగించిన రెండు గుట్టలుగా ప్రోగు చేయబడిన 91 ఎర్ర చందనం దుంగలను గుర్తించడం జరిగిందని వివరించారు. ఎర్ర చందనం మొక్కలను ఎవరైనా పెంచుకోవచ్చని, అయితే వాటిని నరికినపుడు అటవీ శాఖ అనుమతి తప్పనిసరిగా ఉండాలన్నారు. గోడౌన్ లేదా డిపో పెట్టుకోవాలంటే దానికి ప్రత్యేకమైన లైసెన్స్ పొంది ఉండాలని, అలాగే నరికిన చెట్లను ఆ ప్రాంతం నుండి వేరే ప్రదేశానికి తరలించాలంటే అందుకు రవాణా అనుమతి కూడా తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. ఈ మూడు జరగనందున ఆంధ్రప్రదేశ్ అటవీ చట్టం మరియు ఆంధ్రప్రదేశ్ ఎర్రచందనం రూల్స్ మేరకు వారిపై కేసు నమోదు చేసి, సదరు ఎర్ర చందనం దుంగలను సిబ్బంది సహాయముతో జిల్లా అటవీ శాఖా కార్యాలయంకు తరలించడం జరిగిందని ఆయన వివరించారు. ఈ ఎర్ర చందనం ఘన పరిమాణం సుమారు 3261.82 కేజీలు ఉన్నట్లు నిర్ధారణ చేసామన్నారు. దీనిపై తదుపరి విచారణ జరుగుతుందని, అనుభవజ్ఞుల సలహా మేరకు దీనిలోని కొంతభాగాన్ని తిరుపతిలో గల సెంట్రల్ డ్రగ్ శాండిల్స్ గోడౌన్ కు పంపుతామన్నారు. వారి నుండి పూర్తి సమాచారం అందిన పిదప పట్టుబడిన దుంగల విలువ తెలుస్తుందన్నారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం అటవీ పరిధి అధికారి జి.జగదీశ్వరరావు, రణస్థలం ఉప అటవీ క్షేత్రాధికారి ఆర్.అప్పలనాయుడు, ఎన్.శ్రీనివాసరావు,ఇతర అటవీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
0 Comments