ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

సాగు హక్కులు కల్పించకపోతే... ఉద్యమం ఉధృతం

ప్రజా-పత్రిక ఎచ్చెర్ల : నారాయణపురం భూ సాగుదారులకు సాగు హక్కులు కల్పించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మండలంలో చిలకపాలెంలోని నారాయణపురం భూములను సాగు చేస్తున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని, క్వారీ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ నారాయణపురం భూ సాగుదారుల పోరాట కమిటీ ఆధ్వర్యాన తహశీల్దార్‌ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. చిలకపాలెం గ్రామ ఎస్‌సి, బిసిలకు చెందిన సుమారు 200 మంది పేద రైతులు నారాయణపురం రెవెన్యూ పరిధిలోని భూములు 171 ఎకరాలను తరతరాలుగా సాగు చేసుకుని జీవిస్తున్నారని తెలిపారు. 2014 వరకు రైతుల పేర్లు అడంగల్‌లో సాగుదారులుగా నమోదై ఉండేవన్నారు. భూమితో ఏనాడు ఏ సంబంధం లేని శ్రీకాకుళానికి చెందిన ల్యాండ్‌ మాఫియా బ్రోకర్లు ఈ భూములు మాకు అమ్మివేయాలని సాగు రైతులపై ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. రైతులు భూములు అమ్మకపోవడం వల్ల అడంగల్‌లో రైతుల పేర్లను తొలగించేశారని తెలిపారు. ఈ భూముల్లో జీడి, మామిడి, టేకు, అకేసు, నీలగిరి, సరుగుడు తోటలతో పాటు ఉలవ, జొన్న తదితర పంటలు పండిస్తున్నారని చెప్పారు. రైతుల భూముల్లో క్వారీకి అనుమతులు ఇచ్చి తవ్వివేస్తున్నారని తెలిపారు. కొండ నుంచి కింది చెరువులకు వచ్చే సాగునీటి కాలువలు, చెక్‌డ్యామ్‌లు, గోర్జులను తవ్వేస్తున్నారన్నారు. భూములలో ఆరుగాలం కష్టపడి పెట్టుబడులు పెట్టి రైతులు వేసుకున్న పంటలను నాశనం చేశారని, మళ్లీ పంటలు వేసుకోనీయకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. రైతులకు ఈ భూములు తప్ప వేరే ఆధారం గానీ, ఆస్తులు గానీ లేవన్నారు. సాగు చేసుకుంటున్న రైతులను సాగుదారులుగా అడంగల్‌లో పేర్లు నమోదు చేసి పట్టాలు ఇవ్వాలని, నష్టపరిచిన పంటలకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. క్వారీకి ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలన్నారు. రైతుల న్యాయమైన పోరాటానికి అండగా ఉంటామని ఐద్వా జిల్లా కన్వీనర్‌ ఎ.లక్ష్మి, శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్‌ కె.నాగమణి, రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.మోహనరావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి.ప్రసాదరావు అన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు మాట్లాడుతూ రెవెన్యూ మంత్రి జిల్లాలోనే రక్షణ లేకుండా పోయిందన్నారు. రైతులపై పోలీసులు పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ధర్నా అనంతరం ఉప తహశీల్దార్‌కు ప్రతినిధి బృందం వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నారాయణపురం భూ సాగుదారుల పోరాట కమిటీ నాయకులు టి.నందోడు, కె.అప్పన్న, కె.రమణమ్మ, పి.కవిలేశ్వరరావు, జర్జాపు సీతారాం, మాజీ సర్పంచ్‌ పి.మల్లేష్‌, ఉప సర్పంచ్‌ ఎల్‌.అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments