ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

వికేంద్రీకరణకే ప్రజల మద్దతు- ఉత్తరాంధ్ర గర్జన యాత్ర విజయవంతం చేయాలి. - ఏర్పాట్లు పరిశీలించిన కృష్ణదాస్

వికేంద్రీకరణకే ప్రజల మద్దతు
- ఉత్తరాంధ్ర గర్జన యాత్ర విజయవంతం చేయాలి. 
- ఏర్పాట్లు పరిశీలించిన కృష్ణదాస్

నరసన్నపేట, నవంబర్ 1:

రాష్ట్ర ప్రజలంతా పాలనా వికేంద్రీకరణనే కోరుకుంటున్నారని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. నరసన్నపేటలో బుధవారం జరగనున్న ఉత్తరాంధ్ర గర్జన కార్యక్రమ ఏర్పాట్లని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ విశాఖ పాలనా రాజధాని కావాల్సిన అవసరం ఉత్తరాంధ్ర జిల్లాలకు ఎక్కువగా ఉందన్నారు. ఈ రాష్ట్రానికి శాశ్వత రాజధానినే లేకుండా చేసిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. ఏపీ విభజన చట్టంలో పదేళ్ళు రాజధానిగా హైదరాబాద్ ఉండగా అది వదిలేసి చంద్రబాబు ముడు నెలల్లో వచ్చేసారని.. శివరామకృష్ణ కమిటీ పెద్ద క్యాపిటల్ వద్దని సలహా ఇస్తే.. చంద్రబాబు తాబేదారులు చెప్పే విజయవాడ- గుంటూరు లో అసలు రాజధానే వద్దన్నారని గుర్తు చేశారు. దేశంలో చాలా రాష్ట్రాలలో హైకోర్ట్ ఒక దగ్గర, పరిపాలనా రాజధాని ఒకదగ్గర ఉన్నాయని అలాంటప్పుడు రాష్ట్రంలో మూడు రాజధానులుంటే ఇబ్బంది ఏమిటన్నారు. చంద్రబాబుకి ఒక్క రియల్ ఎస్టేట్ తప్ప ఏం పట్టదన్నారు. రాష్ట్రంలో ఉన్న ఏకైక పెద్ద పట్టణం విశాఖ అని.. రాజధానికి అవకాశం ఉన్న ఒకే పట్టణం విశాఖే అన్నారు. అందువల్ల విశాఖ రాజధానికి మద్దతుగా జరుగుతున్న ఉత్తరాంధ్ర గర్జనలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని, విజయవంతం చేయాలని ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఉదయం 9.00 గంటల నుంచి నరసన్నపేట పైడితల్లి అమ్మవారి ఆలయం దగ్గరకు అంతా చేరుకోవాలని, అక్కడి నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు యాత్ర సాగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఎంపిపి ఆరంగి మురళీధర్, జెడ్పీటీసీ చింతు రామారావు, సర్పంచ్ బురల్లి శంకర్, పొందర కార్పొరేషన్ చైర్ పర్సన్ ప్రతినిధి రాజాపు అప్పన్న, కళింగ కోమటి కార్పొరేషన్ డైరెక్టర్ పొట్నురు సాయిప్రసాద్, శిష్టకరణ కార్పొరేషన్ డైరెక్టర్ సదాశివుని కృష్ణ, దండి ప్రకాష్, ఎంపీటీసీ నాగవంశం శ్రీనివాస్, వార్డ్ మెంబెర్ అందవరపు పాపారావు, పెద్దిరెడ్ల రాము, తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments