బిఎల్ఓలు మాత్రమే హాజరు కావాలి.
ఓటర్ల వివరాలు రాజకీయ పార్టీ నాయకులకు అందజేయాలి
స్పష్టం చేసిన కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్
శ్రీకాకుళం, జూలై 15 : జిల్లాలో ఈ నెల 21నుండి వచ్చే నెల 21వరకు బి.ఎల్.ఓలు తమ పరిధిలోని ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ పేర్కొన్నారు. ఇందులో వాలంటీర్లను వినియోగించ రాదని, స్వయంగా బిఎల్ఓలే వెళ్లాలని కలెక్టర్ తేల్చిచెప్పారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో బి.ఎల్.ఓలు, ఈ.ఆర్.ఓలు, ఏ.ఈ.ఆర్.ఓ లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత నెల 20న ఈ.ఆర్.ఓ,ఏ.ఈ.ఆర్.ఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించుకున్నామని, ప్రస్తుతం 2,432 మంది బి.ఎల్.ఓలు, 10 మంది ఈ.ఆర్.ఓలు, 30 మంది ఏ.ఈ.ఆర్.ఓలను కలుపుతూ శిక్షణ కార్యక్రమం నిర్వహించు కుంటున్నామని తెలిపారు. 2024 ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా జూలై 21 నుండి ప్రతి బి.ఎల్.ఓ వారి పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి, ఆ గృహంలోని ఓటర్ల వివరాలు సేకరించాలని అన్నారు. ఓటర్లకు చెందిన మార్పులు, చేర్పులను కూడా పరిగణలోకి తీసుకోవాలని, అలాగే కొత్త ఓటర్లు ఉంటే వాటిని నమోదు చేయాలని సూచించారు. ముఖ్యంగా ఇంటి నెంబరు సరిచూసు కోవాలని స్పష్టం చేశారు. ఓటర్ల నమోదులో బి.ఎల్.ఓలు మాత్రమే వెళ్లాలని, ఎటువంటి వాలంటీర్లను వినియోగించ రాదన్నారు. అలాగే ప్రతి బుధవారం ఆ నియోజక వర్గ పరిధిలోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులతో సమావేశం కావాలన్నారు. ఆ వారంలో సేకరించిన ఓటర్ల వివరాలు, చేసిన మార్పులు, చేర్పులు, కొత్త ఓటర్ల వివరాలను ఇప్పటినుంది తుదిజాబితా ప్రచురణ అయ్యేంతవరకు వారికి అందజేయాలని సూచించారు. వారికి సమర్పించిన ఓటర్ల వివరాలు, మినిట్స్, సమావేశం ఫోటోలను తమకు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఓటర్ల నమోదుకు వెళ్లే బి.ఎల్.ఓలు ముందుగా పర్యటనను ఖరారు చేసుకొని, ఆయా గ్రామస్తులకు రెండు రోజుల ముందే తెలియజేయాలన్నారు. గ్రామాల్లోకి వెళ్ళే అధికారులు తప్పనిసరిగా యూనిఫాం, గుర్తింపుకార్డును తీసుకువెళ్లాలని కలెక్టర్ వివరించారు.
0 Comments