*- రెవెన్యూ శాఖా మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావు.*
*సింగుపురం, నిజామాబాద్ గ్రామాల్లో జగనన్న సురక్ష కార్యక్రమం.*
*పాలనలో గొప్ప మార్పునకు సంకేతం జగనన్న సురక్ష అని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాద రావు అన్నారు. సింగుపురం, నిజామాబాద్ గ్రామాల్లో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు.*
శ్రీకాకుళం, జూలై 18: ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.."ప్రభుత్వం పౌరుల సౌకర్యార్థం జగనన్న సురక్ష పేరిట కార్యక్రమం ఏర్పాటు చేసింది. పరిపాలనను ఇంటి గుమ్మం దగ్గరకే తీసుకు వచ్చాం.
నాలుగేళ్లలో పౌరుల ప్రయోజనం కోసం నిష్పక్షపాత ధోరణిలో పథకాలు అమలు చేసి అందజేశాం.
మంచి విద్య అందించాలన్న దృక్పథంతో, పిల్లలను ఉన్నత స్థాయిలో ఉంచాలన్న సదుద్దేశంతో విద్యావ్యవస్థలో మార్పులు చేశాం. అలానే రైతులకు పెట్టుబడి సాయం కోసం ఏటా రూ.13,500 ఇస్తున్నాం. ఆ రోజు ఎన్నికల ముందు ఏవైతే చెప్పామో అవన్నీ పూర్తి చేశాం. గతంలో మ్యానిఫెస్టోకు కట్టుబడిన ముఖ్యమంత్రులు ఎవ్వరూ లేరు. టీడీపీ చీఫ్ చంద్రబాబు 2014 ముందు మహిళా సంఘాలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టీ మోసం చేశారు, అలానే రైతులకు కూడా..ఆయన మోసం చేశారు.
రుణ మాఫీ పేరిట ఆయన మోసం చేశారు. కానీ ఇవాళ తనకు మరోసారి అధికారం ఇస్తే ఒక్కొక్కరికీ బంగారం ముక్క ఇస్తానంటూ.. మీ ముందుకు విపక్ష నేత చంద్రబాబు వస్తారు. జాగ్రత్త ఆయన్ను నమ్మితే గుండు సున్నా మిగులుతుంది. ఇవాళ సుమారు 1000 మందికి వివిధ ధ్రువీకరణ పత్రాలను సింగుపురం పంచాయతీలో ఇస్తున్నాం. ఒకప్పుడు వీటిని అందుకోవాలంటే మీరంతా కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మీ దగ్గరకే పాలన అందించే కార్యక్రమం మీ సమస్యలు వెనువెంటనే పరిష్కరించేందుకు వీలున్న కార్యక్రమం ఈ జగనన్న సురక్ష. ఈ జగనన్న సురక్ష ద్వారా 11 రకాల సేవలను వినియోగించుకునే వీలుంది.
ఇవాళ ముఖ్య విభాగాల అధికారులూ మీకు ఈ కార్యక్రమం ద్వారా అందుబాటులోకి వస్తున్నారు. కనుక ఈ కార్యక్రమంలో మీరు భాగం అయి, సుదీర్ఘ కాలంగా పొందని, పొందలేని వివిధ ధ్రువీకరణ పత్రాలు అందుకోండి. ఇందుకు మీరు పైసా చెల్లించాల్సిన అవసరం లేదు. గ్రామాల్లో ఇవాళ పాలనను మరింత స్థానికం చేసేందుకు మేం గ్రామ సచివాలయాలు తీసుకుని వచ్చాం. మీకు ప్రభుత్వ పథకాలను కానీ లేదా సంబంధిత పౌర సేవలను కానీ సునాయాసంగా అందించేందుకే వలంటీర్ల నియామకం. ఈ వ్యవస్థలో వచ్చిన పాలన సంస్కరణలు మీరు గమనించండి.
అసైన్డ్ ల్యాండ్స్ విషయంలో రాష్ట్రం మొత్తం మీద 27 లక్షల ఎకరాల భూమిపై హక్కు ఇచ్చాము. వీటి ద్వారా సంబంధిత లబ్ధిదారుల గౌరవం సమాజంలో మరింత పెరిగింది. ఇక సంక్షేమ పథకాలన్నింటినీ ఇల్లాలి పేరిటే అందిస్తున్నాం. అనేక సానుకూల చర్యల ద్వారా పథకాల అమలు ద్వారా ఆర్థిక ప్రగతిని అందించడం ద్వారా ఇవాళ మహిళల గౌరవం పెంచింది మన జగన్ ప్రభుత్వం. ఇంటి గౌరవం అన్నది మహిళల హోదా పెరిగినప్పుడు లేదా వారంతా సామాజిక ఉన్నతి పొందినప్పుడే సాధ్యం అవుతుంది అని నమ్మి ఇవాళ సంక్షేమ పథకాలు మహిళల పేరిట ఇస్తున్నాం.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ మాటకు కట్టుబడి ఉన్నాం. మాటకు కట్టుబడి ఉండే నాయకుడు అధికారంలో ఉన్నపుడే.. పౌరులకు మంచి జరుగుతుంది అన్నది ఇప్పటికే నిరూపణ అయింది. ఇవాళ నిత్యావసర ధరలపై విపక్షాలు ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం చేస్తున్నాయి. ఒక్క ఆంధ్ర రాష్ట్రం లోనే కాదు,దేశం మొత్తమ్మీద ధరలు పెరిగాయి. ముఖ్యంగా పెట్రోలు,డీజిలు, గ్యాసు,వంట నూనె ధరల విషయమై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఓ తీసుకుంటుంది. మీరు ఇవన్నీ తెలుసుకోవాలి. తక్కువ ధరకే నాణ్యమయిన బియ్యం, కందిపప్పు అందించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టాం. వీటిని మీరు గుర్తించాలి. ప్రభుత్వం పై విష ప్రచారం చేసే వారిని నమ్మకండి. ఆ విధంగా టీడీపీని నమ్మితే కూర్చొన్న కొమ్మను నరుక్కున్న వారవుతారు. ఇవాళ వైద్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నాం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను తీసుకు వచ్చాం,అందరినీ ఆరోగ్యం ఉండేలా చర్యలు తీసుకున్నాం. మీ గ్రామాల్లో వస్తున్న మార్పులను గమనించండి. మీ మేలు కోరే ప్రభుత్వానికి మరోసారి మద్దతివ్వండని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు.
నియోజవర్గం పరిశీలకులు ఎస్టీ కమిషన్ చైర్మన్ డివిజీ శంకర్ రావు, జిల్లా రైతు విభాగం అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు, ఎంపిపి గోండు రఘురాం, అంబటి నిర్మల, ఎఎంసి చైర్మన్ ముకళ్ల తాతబాబు, సర్పంచ్ గోండు ఆదిత్య నాయుడు, మాజీ సర్పంచ్ గుండమోహన్ ఎమ్మార్వోలు వెంకటరావు, రామ రావు, ఈవో పిఆర్డి ప్రకాష్ రావు, ముంజేటి కృష్ణ, మాజీ డీసీఎంఎస్ గోండు కృష్ణ, కోయ్యాన నాగభూషణం, పీస గోపి, బగ్గు అప్పారావు , రంది రాజారావు తదితరులు పాల్గొన్నారు.
0 Comments