శ్రీకాకుళం, జూలై 06: సంక్షేమానికి సంపూర్ణ భరోసా జగనన్న సురక్ష కార్యక్రమం అని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. స్థానిక వైఎస్సార్ కల్యాణ మండపంలో హెడ్ పోస్టాఫీసు పరిధిలో ఉన్న లబ్ధిదారులతో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరు పేదలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు నిర్విరామంగా అందాలి అనే సంకల్పంతో జగనన్న సురక్ష కార్యక్రమం చేపట్టాం.
ఏ ఒక్కరూ ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన పనుల విషయమై నిస్సహాయంగా ఉండిపోకూడదు అనే సదుద్దేశంతో అధికార యంత్రాంగమే మీ దగ్గరకు వచ్చే విధంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశాం. రాష్ట్రం అంతటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇవాళ్టి కార్యక్రమంలో 213 మందికి వివిధ ధ్రువీకరణ పత్రాలు అందించాం. అదేవిధంగా మిగిలిన ప్రాంతాలలో కూడా ఈ కార్యక్రమ నిర్వహణతో దేశంలోనే పాలన సంబంధించిన మంచి పేరు మనకు రానుంది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నివ్వెరపోతున్నారు. ఆ స్థాయిలో ఇక్కడ సంక్షేమ పథకాల అమలు ఉంది.
కరోనా సమయంలో ఎవ్వరూ ఆకలితో అలమటించకుండా ఉండేందుకు ప్రభుత్వం తరఫున నిత్యావసరాలు అందించాం. ప్రతి కుటుంబానికి తోడుగా వలంటీర్ ఉన్నాడనే ధైర్యం కల్పించాం. అలానే ఎన్నికల ముందు చెప్పిన విధంగా ఎన్నికల ముందు మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా 98శాతం హామీలు అమలు చేశాము. దేశంలోనే మ్యానిఫెస్టోను పూర్తి స్థాయిలో అమలు చేసిన ఘనత వైఎస్సార్సీపీకే దక్కుతుంది. నిష్పక్షపాతంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు పని చేస్తున్నారు. అవినీతి,లంచాలు లేని సమాజం రూపకల్పనకు సాయం అందిస్తున్నారు.
ఇక నగర అభివృద్ధికి వస్తే పొట్టి శ్రీరాములు పెద్ద మార్కెట్ ని అభివృద్ధి చేశాము. రిమ్స్ లో 900 బెడ్స్ అందుబాటులో తీసుకు వచ్చాము. సర్కారు బడులను నాడు నేడు పేరిట పూర్తిగా ఆధునిక వసతులతో మార్చేశాము. గ్రామ సచివాలయాల పేరిట పాలన మీ ఇంటి వద్దకే తీసుకు వచ్చాము. ఇది అసలైన అభివృద్ధి. ప్రతిపక్షాలు ఈ అభివృద్ధి అర్థం కాదు. నాలుగేళ్లలో వచ్చిన మార్పును గమనిస్తే పౌరులకు సామాజిక గౌరవం పెరిగింది. ఎవ్వరి దగ్గర తలవంచుకు జీవించే రోజులు పోయాయి. ఇవేవీ గుర్తించని వారు విమర్శలు చేస్తుంటారు.
మన దగ్గర ఉన్న మీడియా సంస్థలు పార్టీ ప్రయోజనాలకు పని చేస్తుంటాయి. ప్రజలకు మంచి చూపించే ఆలోచన వాళ్లకు లేదు అని విపక్ష పార్టీలకు చెందిన మీడియాను ఉద్దేశించి విమర్శలు చేశారు. మేలు చేసే ప్రభుత్వానికి మరోసారి మద్దతు ఇవ్వాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు.
రాష్ట్ర కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ మెంటాడ పద్మావతీ, సాదు వైకుంఠ రావు, మెంటాడ స్వరూప్, మండవిల్లి రవి కుమార్, ఖాన్, కోణార్క్ శ్రీనివాస్ రావు, డాక్టర్ పైడి మహేశ్వర రావు,పొన్నాడ రిషి, భైరి మురళి, బరాటం సంతోష్, ఉన్నా నాగరాజు, గాంధీ, ప్రకాష్, జలగడుగులు శ్రీను, భరద్వాజ తదితరులు పాల్గొన్నారు.
0 Comments