నరసన్నపేట, ఆగస్ట్ 3: విపక్షాలు రోజుకో అబద్దంతో ప్రజల్ని వంచిస్తున్నాయని, స్వార్ధమే పరమావధిగా పవన్, చంద్రబాబు కుయుక్తులు చేస్తున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. జగనన్న సురక్ష విజయవంతమైన సందర్భంగా నరసన్నపేట పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం జగన్ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచే పోటీ చేస్తామని ఎంపీ స్థానానికి వైసీపీ అభ్యర్ధి విషయమై అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పార్టీలో క్రమశిక్షణ అవలంబిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పదవులు ఆశించిన కొందరు నేతలు, పదవులు పొందినవారు సైతం పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఎంతటి వారైనా సరే వారిపై వేటు తప్పదన్నారు. పద్ధతి మార్చుకునేందుకు చివరి అవకాశం ఇస్తామని హెచ్చరించారు.
ధర్మాన కృష్ణదాస్ ఇంకా ఏమన్నారంటే! ఆయన మాటల్లోనే..
14 ఏళ్లు అధికారంలో ఉండి.. అవకాశం ఉన్నా ఏమీ చేయని టిడిపి, ప్రజా ధనం ప్రభుత్వం వృధా చేసిందని నాలుగేళ్లుగా పోరు పెట్టింది. ఇప్పుడు తామూ ఆ పథకాలు కొనసాగిస్తామని చెబుతోంది. ప్రజల గడప వద్దకే ప్రభుత్వ పాలన అందించాలన్న లక్ష్యంతో సీఎం జగన్ ముందుకు సాగుతున్నారు.
ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకుని, అక్కడికక్కడే పరిష్కరించాలన్న ఆలోచనతో ప్రారంభమైందే జగనన్న సురక్ష పథకం. అర్హులైన వారు ప్రభుత్వ పథకాలు అందకుండా మిగిలిపోకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారుల నుంచి గ్రామస్థాయి సిబ్బంది వరకు అంతా కలిసి పని చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జూన్ 23న ప్రారంభించిన జగనన్న సురక్ష అనుకున్న లక్ష్యాన్ని సకాలంలో నెరవేర్చిందని తెలిపారు. ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్‌లను, ఇతర సేవలను యుద్ద ప్రాతిపదికన ప్రతి ఒక్కరి ఇంటి వద్దకే అందిస్తూ దిగ్విజయంగా కొనసాగింది.
జులై 1వ తేదీ నుంచి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 15,004 సచివాలయాల్లో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. లంచం అనే మాట ఎక్కదా వినిపించలేదు. జగనన్న సురక్ష కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 1.46 కోట్ల కుటుంబాలను వాలంటీర్లు సర్వే చేసి ప్రజలకు ఏ సేవలు కావాలో అడిగి మరీ నమోదు చేసుకున్నారనీ కృష్ణ దాస్ వివరించారు.
ఈ మీడియా సమావేశంలో ధర్మాన కృష్ణదాస్ తో పాటు ఎంపీపీ ఆరంగి మురళీధర్, చింతు రామారావు, ముద్దాడ బైరాగినాయుడు, కోరాడ చంద్రభూషణ్ గుప్త, చీపురు కృష్ణమూర్తి, నక్క తులసీదాస్, తంగి మురళి కృష్ణ, తంగుడు జోగారావు, పొట్నూరు ప్రసాద్, సదాశివుని కృష్ణ, బురెళ్ల శంకర్, పాగొటి రాజారావు, బొబ్బది ఈశ్వరరావు, చింతాడ ఉమా, రెంటి కోట త్రినాధరావు, సురంగి నరసింగరావు, పొన్నాన దాలి నాయుడు తదితరులు పాల్గొన్నారు.
0 Comments