ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

క్రీడాకారులు దేశానికి గర్వకారణం కావాలి.జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్

శ్రీకాకుళం,ఆగస్టు 29 : జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించి దేశానికి గర్వకారణం కావాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ జిల్లాలోని క్రీడాకారులకు పిలుపు నిచ్చారు. హాకీ లెజెండ్ మేజర్ ధ్యానచంద్ జన్మ దినోత్సవం సందర్భంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మరియు సెట్ శ్రీ ఆధ్వర్యంలో స్థానిక ఏడు రోడ్ల కూడలి వద్ద జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు మంగళవారం జరిగాయి. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొని క్రీడా జ్యోతిని వెలిగించి కోడి రామమూర్తి స్టేడియం వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. స్టేడియంలో ఏర్పాటుచేసిన బాక్సింగ్, టైక్వాండో, వెయిట్ లిఫ్టింగ్ క్రీడలను కలెక్టర్ తిలకించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ధ్యానచంద్ తొలిసారిగా దేశానికి ఒలింపిక్ మెడల్ ను సాధించడమే కాకుండా, మూడుసార్లు గోల్డ్ మెడల్ సాధించి దేశానికి గొప్ప గుర్తింపు తెచ్చారని కొనియాడారు. ఆయన విజయాలను వందేళ్లు అయినప్పటికీ గుర్తు చేసుకుంటున్నామని చెప్పారు. ఆయన స్ఫూర్తితో జిల్లా క్రీడాకారులు ఎన్నో విజయాలను సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ప్రపంచంలోనే అతి పెద్ద జనాభా కలిగిన దేశం మనదైనప్పటికీ క్రీడల్లో వెనుకబడి ఉన్నామని, అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖేలో ఇండియా, ఆడుదాం ఆంధ్రా వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ క్రీడలను ప్రోత్సహిస్తున్న సంగతిని కలెక్టర్ గుర్తుచేశారు. క్రీడల్లో పతకాలు సాధిస్తే దేశానికి, రాష్ట్రానికి మంచిపేరును తీసుకురావడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా లభిస్తాయని తెలిపారు. కావున జిల్లాలోని క్రీడాకారులందరూ క్రీడల్లో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. క్రీడాకారులకు అవసరమైన మౌలికవసతులు, సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. క్రీడల్లో రాణించాలనే జిజ్ఞాస,ఉత్సహం ఉంటే తప్పకుండా జాతీయ, అంతర్జాతీయ పతకాలు సాధిస్తారని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా క్రీడల్లో విశేష కృషి చేసిన జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం.ఎస్.ఆర్.కృష్ణమూర్తి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.సాంబమూర్తి లకు కలెక్టర్ దుస్సాలువతో సత్కరించి, జ్ఞాపికను అంద జేశారు.

సెట్ శ్రీ ముఖ్య కార్యనిర్వాహణాధికారి బివి.ప్రసాదరావు మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా అనే కార్యక్రమాన్ని అక్టోబర్ 2 నుండి నవంబర్ 2 వరకు నిర్వహిస్తుందని అన్నారు. క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, ఖో-ఖో మరియు కబడ్డీ పోటీలు ఇందులో ఉంటాయని, గ్రామ- వార్డు సచివాలయాలు, మండల,నియోజక వర్గ, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో పోటీలను నిర్వహించడం జరుగు తుందన్నారు. రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన విజేత లకు రాష్ట్ర ముఖ్యమంత్రి నగదు బహుమతిని అందిస్తారని వివరించారు. వెయిట్ లిఫ్టింగ్ లో జిల్లాకు మంచి పేరు ఉందని, అలాగే ఆడుదాం ఆంధ్రా పోటీల్లో కూడా గెలుపొంది, మంచి పేరును తీసుకురావాలని ఆయన అకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, జిల్లా చీఫ్ కోచ్ డా.శ్రీధర్,నగరపాలక సంస్థ కమీషనర్ చల్లా ఓబులేశు, జిల్లా పర్యాటక అధికారి ఎన్. నారాయణరావు, నెహ్రూ యువ కేంద్ర అకౌంట్స్ ఆఫీసర్ జి.శ్రీనివాసరావు,జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె.చెన్నకేశవరావు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments