- ఆంద్రాకు జగన్ ఎందుకు కావాలో చెప్పాలి.
- గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి తేడాను స్పష్టం చేయాలి.
- నరసన్నపేట సదస్సులో ధర్మాన కృష్ణదాస్.
నరసన్నపేట:-వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం గత నాలుగేళ్లలో సాధించిన విజయాలను ఇంటింటికీ ప్రచారం చేయాలని, గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి తేడాను స్పష్టంగా చెప్పాలనీ, ప్రతిపక్ష పార్టీల ఆరోపణలను ఈ విజయాలతోనే గట్టిగా తిప్పికొట్టాలని మాజీ డిప్యూటీ సీఎం, నరసన్నపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. ఆంధ్రాకు జగన్ ఎందుకు కావాలి అనే అంశంపై నరనసన్నపేట మండల పార్టీ ముఖ్యనాయకులు, కన్వీనర్లు, గృహసారధులు, పార్టీ ప్రజాప్రతినిధులతో ఆయన ఎస్‌విఎల్ కళ్యాణ మండపంలో జరిగిన సదస్సులో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవహగాన కల్పించేందుకు ప్రతీ గ్రామంలో మారుమూల వీధులకు వెళ్లి సైతం ఈ సారి ప్రచారం నిర్వహించాలని సూచించారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఒక గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఒక దఫా ప్రజల్ని నేరుగా కలిసామని, అప్పుడు వారికి ప్రభుత్వం తరపున అందిన లబ్ధిని గురించి చెప్పామని, ప్రజా సమస్యలను సైతం పరిష్కరించి వారికి దగ్గరయ్యామని గుర్తు చేసారు. ఈ సారి ప్రతిపక్ష పార్టీలు చెబుతున్న అబద్ధాలు, అసత్యాలు, ఒంటరిగా పోటీచేయలేక సాగిస్తున్న కుయుక్తుల గురించి వారికి విడమరచి చెప్పాల్సి ఉందని పేర్కొన్నారు. రానున్న నాలుగు నెలల సమయం కీలకమని చెప్పారు. ప్రభుత్వం చేసిన మంచిని ప్రతి ఇంటికి మళ్లీ మళ్లీ తెలియజేసే కార్యక్రమమే ఆంధ్రాకు జగన్ ఎందుకు కావాలో తెలిపే కార్యక్రమమన్నారు. చంద్రబాబు పాలన, ఈ రోజు మన జగన్‌మోహన్ రెడ్డి పాలన రెండిరటికీ ఉన్న తేడాపై ప్రజల్లో ఆలోచనలు, ప్రేరేపించేలా ప్రతి గడపకు మరోసారి తీసుకెళ్లాలని క్యాడర్‌కు కృష్ణదాస్ పిలుపునిచ్చారు. బీసీ సెల్ జోనల్ ఇన్చార్జి ధర్మాన కృష్ణచైతన్య మాట్లాడుతూ ఎంత మంచి చేసామని చెప్పుకునే పరిస్థితుల్లో ఉన్న మనం రాష్ట్రంలో 175 స్థానాలు ఎందుకు గెలవలేమని, ప్రభుత్వం చేస్తున్న మంచిపై దుష్ప్రచారం చేసే వాటిని గుర్తించి, సామాజిక మాధ్యమాల ద్వారా వాటిని తిప్పికొట్టి ప్రజల్లోకి సవివరంగా తీసుకెళ్ళాలని అన్నారు. నరసన్నపేట నియోజకవర్గం గడిచిన ఎన్నికల్లో జిల్లాలోనే అత్యధిక మెజార్టీ సాధించిందని, ఈ సారి రెట్టింపు మెజార్టీ సాధించేలా తామంతా పనిచేస్తామని అన్నారు. కార్యక్రమంలో డీసీసీబి ఛైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఎమ్పీపీ ఆరంగి మురళీధర్, పార్టీ నాయకులు చింతు రామారావు, బార్ల వేణుగోపాల్, కోరాడ చంద్రభూషణ్ గుప్త, రాజాపు అప్పన్న, లుకలాపు రవికుమార్, సదాశివుని కృష్ణ, రౌతు శంకరరావు, పొట్నూరు సాయి ప్రసాద్, పుట్టా ఆదిలక్ష్మి, మంతెన రాము తదితరులు పాల్గొన్నారు.
0 Comments