జలుమూరు:-అనితరసాధ్యంగా ప్రజాసంక్షేమానికి కృషిఛెస్తున్న సీఎం వైఎస్ జగన్ జనం హృదయాల్లో చెరగని ముద్రవేశారని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. జలుమూరు మండలం లింగాలవలస గ్రామం చల్లపేట జగనన్న కాలనీ సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం అనంతరం ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ 2.40 లక్షల కోట్ల రూపాయలతో ఈ నాలుగున్నరేళ్ళలో సీఎం జగన్ రాష్ట్రంలోని ప్రజల జీవన ప్రమాణాలను పెంచారన్నారు. విద్య, వైద్యానికి, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ, ఎక్కడాలేనివిధంగా సంక్షేమ కార్యక్రమాలను జగన్ అమలు చేస్తున్నారని అన్నారు. అందువల్లే మళ్లీ ఈ రాష్ట్రానికి సీఎంగా జగనే కావాలని అంతా కోరుకుంటున్నారన్నారు. ప్రజాభిమానాన్ని ఇంతటి స్థాయిలో పొందిన జగన్ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు.
రాష్ట్ర ప్రజల్ని అనేక విధాలుగా మోసగించిన టీడీపీని 2019లోనే తిరస్కరించారన్నారు. చంద్రబాబు తన పాపాలుపండి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఊచల్ని లెక్కపెట్టుకుంటున్నారన్నారు. తప్పుచేసిన ఎవరూ తప్పించుకోలేరు అనడానికి చంద్రబాబే పెద్ద ఉదాహరణ అని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్, అమరావతి, ఔటర్ రింగురోడ్, ఏపీ ఫైబర్ గ్రిడ్..ఇలా ప్రతిదాన్లోనూ అక్రమాలకు పాల్పడి జైలుపాలై దీనికి అంతటికీ కారణం జగన్ అంటూ మళ్లీ పచ్చి అబద్దాలు చెబుతున్నారన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడినవారు ఎంతటివారైనా ఎప్పటికీ తప్పించుకోలేరన్నారు.
వాలంటీర్లు, గ్రామసచివాలయాల ద్వారా ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న సీఎం జగన్ ను జనం తమ గుండెల్లో పెట్టుకున్నారని, అది తట్టుకోలేని విపక్షాలు, ఎల్లో మీడియా కావాలని బురద జల్లుతున్నాయన్నారు. జిల్లాలో మత్స్యకార ప్రాంతాల అభివృద్ధికి మూడువేల కోట్ల రూపాయలతో మూలపేట పోర్టు నిర్మాణం జరుగుతోందని అన్నారు. ఇదే విధంగా ఏ రంగాన్ని తీసుకున్నా ప్రగతి ప్రత్యక్షంగా కనిపిస్తోందని అన్నారు.
మీడియాతో మాట్లాడిన ధర్మాన కృష్ణదాస్ తో డిసిసిబి చైర్మన్ కరిమి రాజేశ్వరరావు తదితరులున్నారు.
0 Comments