శ్రీకాకుళం, నవంబర్ 28: ఖచ్ఛితమైన ఓటర్ల జాబితాను రూపొందించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ, ఓటర్ల జాబితా పరిశీలకులు జె. శ్యామలరావు అన్నారు. మంగళవారం కలెక్టరెట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ డ్రాఫ్ట్ పబ్లికేషన్ రోజు నుంచి ఇప్పటివరకు ఓటర్ల జాబితా సవరణలో తీసుకుంటున్న చర్యలను వివరించారు. అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధులు లేవనెత్తిన పలు సమస్యలను నమోదు చేసుకుని, లిఖితపూర్వకంగా . సమర్పించిన వినతులను తీసుకున్నారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకు లోబడి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని, అత్యంత పారదర్శకంగా జాబితాలను తయారు చేస్తామని హామీ ఇచ్చారు..
టి.డి.పి ప్రతినిధి కూన రవి కుమార్ మాట్లాడుతూ కొన్ని చనిపోయిన వారి ఓట్లు, డబల్ ఎంట్రీల తొలగింపు చేపట్టాలని, కొత్త ఓటర్ల నమోదు జాబితాలను తమకు అందజేయాలని సూచించారు. బిజెపి ప్రతినిధులు బిర్లంగి ఉమామహేశ్వరరావు, చల్లా వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ సూపర్ సీనియర్ సిటిజన్లకు ఓటర్ల జాబితాలో ప్రత్యేక గుర్తింపు మార్కు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వైకాపా జిల్లా ఉపాధ్యక్షులు రౌతు శంకర రావు మాట్లాడుతూ, ఓటర్ల జాబితా పట్ల తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని, పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ రాజకీయ పార్టీల సమన్వయంతో నమోదు ప్రకీయ జరుగుతోందని, ప్రతీ వారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నియోజకవర్గ స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ సమావేశాలు నిర్వహించి వారి సూచనలు సలహాలు పరిగణలోనికి తీసుకువడం జరుగుతుందన్నారు.
సి.పి.ఎం ప్రతినిధి డి గోవింద రావు, కాంగ్రెస్ ప్రతినిధి గోవింద మల్లిబాబు, ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్, మాజీ ఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి, కలమట వెంకటరమణ, గుండ లక్ష్మీదేవి తదితరులు తమ తమ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాలో సమస్యలను తెలిపారు.
ఈ సమావేశాల్లో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, సహాయ కలెక్టరేట్ రాఘవేంద్ర మీనా, ఇంచార్జ్ డిఆర్ఓ జయదేవి, శ్రీకాకుళం, పలాస ఆర్డిఓలు సిహెచ్ రంగయ్య, భరత్ నాయక్ పాల్గొన్నారు.
0 Comments