శ్రీకాకుళం, నవంబర్ 28: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పారదర్శక విధానాలు అవలంభించాలని, ఎన్నికల కమిషన్ నిబంధనలు తు.చ. తప్పకుండా పాటించాలని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, శ్రీకాకుళం జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు (రోల్ అబ్జెర్వర్) జె. శ్యామలరావు ఆదేశించారు.
ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా అయన శ్రీకాకుళం జిల్లా కలెక్టరెట్ సమావేశ మందిరంలో ఈఆర్ఓలు, ఎంఆర్ఓ లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డ్రాఫ్ట్ పబ్లికేషన్ రోజు నుంచి నేటి వరకూ వచ్చిన ఓటర్ల జాబితాలో అభ్యంతరాలపై ఆరాతీశారు. మార్పులు చేర్పులు, నోటీసుల జారీ, తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఓటర్లు, పోలింగ్ కేంద్రాల నిష్పత్తి, కొత్త ఓటర్ల చేరికలపై ఆరా తీశారు. కొత్త ఓటర్ల సంఖ్య జనాభా నిష్పత్తికి అనుగుణంగా పెరగాలని, జిల్లాలో చేపట్టిన ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాల అమలు పై పరిశీలించారు. రానున్న డిసెంబర్ 2,3 తేదీల్లో శని, ఆదివారాల్లో నిర్వహించనున్న ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాల విజయవంతం చేయాలన్నారు.
జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ కొత్త ఓటరు నమోదుకు చేపట్టిన కార్యక్రమాలపై మండలాల వారీగా తీసుకున్న చర్యలను వివరించారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు అనుసరించి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రానున్న డిసెంబర్ 7వ తేదీ నాటికి ఎలాంటి పెండింగ్ దరఖాస్తులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఇంఛార్జి డీఆర్వో జయదేవి, ఆర్డివోలు సిహెచ్. రంగయ్య, భరత్ నాయక్, ఉప కలెక్టర్ పద్మావతి, జెడ్పీ సీఈవో ఆర్.వెంకట్రామన్, అన్ని మండలాల తహాసిల్దార్లు తదితురులు పాల్గొన్నారు.
0 Comments