*అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలి*
*ఆస్తి, ప్రాణ నష్టం కలగకుండా చూడాలి*
*టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్*
శ్రీకాకుళం, డిసెంబర్ 02:- జిల్లాకు మిచౌంగ్ తుఫాన్ ప్రభావం దృష్ట్యా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయు నిమిత్తం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాధిక శనివారం సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ రానున్న మిచౌంగ్ తుఫాన్ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. తుఫాన్ ప్రభావం వల్ల డిసెంబర్ 3,4,5వ తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు పంటలు జాగ్రత్త చేసుకోవాలని, తీర ప్రాంత మండలాల్లో మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లకుండా మండల తాసీల్దార్లు గ్రామాల్లో దండోరా వేయించాలని సూచించారు. మత్స్య కారులు బోట్లను, వలలను, పడవలను జాగ్రత్తపర్చుకోవాలని తెలిపారు. అన్ని శాఖల అధికారులు ఎప్పటికప్పుడు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. జిల్లా కేంద్రం లో తుఫాన్ కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశామని 08942- 240557 నెంబర్ కు అత్యవసర సమయంలో ఫోన్ చేయాలని తెలిపారు. మండల స్థాయి అధికారులు తీర ప్రాంతాల్లో పర్యటించి వృద్దులు, మహిళలు, చిన్నపిల్లలను తుఫాన్ షెల్టర్ లకు చేర్చాలని అన్నారు. అవసరమైన సామగ్రి సిద్ధం చేసుకోవాలని తాసీల్దార్లకు సూచించారు. తుఫాన్ గాలుల సమయం లో ఎవ్వరూ బైటకు రాకూడదని ,చెట్ల కిందా, విద్యుత్ స్తంభాలు దగ్గర ఉండకూడదని అన్నారు. వైద్య-ఆరోగ్య శాఖ, విద్యుత్ శాఖ, రహదారులు భవనాల శాఖ, ఎస్.ఇ. ఆర్.డబ్ల్యూ. ఎస్ అధికారులు సిబ్బంది ఖచ్చితంగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అవసరమైన మందులను సిద్ధం చేసుకోవాలని, జిల్లాలో 108 వాహనాలు అన్ని మండలాల్లో సిద్ధంగా ఉన్నాయని అత్యవసర సమయంలో వినియోగించుకోవాలని తెలిపారు. NDRF, STRF బృందాలకు సంబంధిత ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. జనరేటర్ల ను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తాసీల్దార్ల ను ఆదేశించారు. మిచౌంగ్ తుఫాన్ ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని, ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రజలు భయపడకుండా జాగ్రత్తగా ఇళ్ళల్లోనే ఉండాలని తెలిపారు.
ఈ టెలికాన్ఫరెన్స్ లో జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రాధిక, డిఆర్ఓ జయదేవి, టెక్కలి సబ్ కలెక్టర్, పలాస ఆర్.డి.ఓ, మునిసిపల్ కమిషనర్లు, మత్స్య శాఖ, పంచాయతీ రాజ్, పౌర సర్ఫరాల శాఖ, ఎస్.ఇ వంశధార, ఇరిగేషన్, వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ సంబంధిత అధికారులు, తాసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
0 Comments