*స్త్రీల పట్ల వివక్ష ఉండరాదు*
*గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం*
*అబార్షన్లకు గల కారణాలు సేకరించాలి*
*జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా.బి.మీనాక్షి*
శ్రీకాకుళం, డిసెంబర్ 02 : జిల్లాలో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు జరిపిన పిదప వివరాలు వెల్లడించడం చట్టరీత్యా నేరమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.బి.మీనాక్షి పేర్కొన్నారు. అటువంటి స్కానింగ్ సెంటర్లపై, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా సెంటర్ల లైసెన్స్ లను రద్దుచేయడం జరుగుతుందని ఆమె హెచ్చరించారు. గర్భస్థ శిశు స్థితిగతులు, సమస్యలు తెలుసుకునేందుకే స్కానింగులు చేయాలే తప్పా, వీటిని ఆసరాగా తీసుకుని గర్భస్థ శిశు వివరాలు వెల్లడించడం నేరమన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఆదేశాలు మేరకు గర్భస్థ శిశు లింగ నిర్ధారణ (పి.సి.పి.ఎన్.డి.టి) చట్టం అమలుపై జిల్లా స్థాయి సమావేశం మరియు జిల్లా స్థాయి సలహా మండలి సమావేశం ఆమె అధ్యక్షతన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ సమావేశమందిరంలో శుక్రవారం జరిగింది.
ఈ సందర్బంగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి మాట్లాడుతూ జిల్లాలో 108 స్కానింగ్ సెంటర్లు ఉన్నాయని, ప్రతి స్కానింగ్ సెంటరులో సి.సి కెమెరాల ఏర్పాటుచేయడంతో పాటు ఆయా కేంద్రాలపై ప్రోగ్రాం అధికారుల ద్వారా ఎప్పటికపుడు తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు. ఇకపై ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరిగే అబార్షన్ల వివరాలతో పాటు అందుకు తగిన కారణాలను తమకు సమర్పించాలని స్పష్టం చేశారు. సమాజంలో బాల బాలికలిద్దరూ సమానమేనని, స్త్రీల పట్ల వివక్ష ఉండరాదని వివరించారు. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరమనే కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని, బాలికల పట్ల వివక్ష లేకుండా సమాజంలో చైతన్యం తీసుకురావాలన్నారు.
అడిషనల్ సూపరెండెంట్ అఫ్ పోలీస్ విఠలేశ్వర రావు మాట్లాడుతూ మహిళలు నిష్పత్తి పురుషులుతో పోలిస్తే తక్కువగా ఉన్నారని, పురుషుల నిష్పత్తితో సమానంగా మహిళలు ఉండేవిధంగా కృషి చేయాలన్నారు. మహిళలు ఆర్ యం పి డాక్టర్స్, కొంతమంది డాక్టర్స్ పై ఆధారపడి అవాంఛిత గర్భం నుంచి విముక్తి పొందుతున్నారని అన్నారు. కొంతమంది మహిళలు ఏదైనా మెడికల్ షాపు నుంచి అబార్షన్ పిల్ తెచ్చుకుని వేసుకుంటున్నారని, అలా చేస్తే అది ఆరోగ్యానికే ప్రమాదకరం కావచ్చునని ఆయన పేర్కొన్నారు.
విశ్రాంత న్యాయమూర్తి పి.జగన్నాధం మాట్లాడుతూ దేశంలో మంచి చట్టాలు ఉన్నాయని, వాటిని సక్రమంగా వినియోగించుకుంటే సమాజం బాగుంటుందని అభిప్రాయ పడ్డారు. సమాజంలో ఎక్కడైనా భ్రూణ హత్యలు జరిగితే, వాటిపై పోలీసు వ్యవస్థ సమగ్ర విచారణ జరిపి నేరస్తులకు శిక్షలు వేయగలిగితే ఇటువంటివి పునరావృతం కావని వివరించారు. సమాజంలో మహిళల అవశ్యకత పై వివరించాలని,ప్రజల్లో సామాజిక చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు.
అదనపు జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా. బి అనురాధ మాట్లాడుతూ గర్భస్థ శిశు లింగ నిర్ధారణపై గ్రామ స్థాయి నుండి అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సమాజంలో స్త్రీల నిష్పత్తి తక్కువగా ఉండడానికి కారణం ఆడపిల్లల జననాలు తగ్గడమేనని స్పష్టం చేశారు. ఆడ,మగ తెలుసుకోవడానికి లింగ నిర్దారణ పరీక్షలు నిర్వహించడం తప్పన్నారు. శారీరకంగా, మానసికంగా సిద్ధం ఉన్నప్పుడే వివాహాలు చేయాలని ఆయన వివరించారు.
హెల్త్ ఎడ్యుకేటర్స్ ఎస్. సూర్యకళ పి పి టి ద్వారా పి సి పి ఎన్ డి టి యాక్ట్ పై ప్రెసెంటేషన్ పాటు స్కాన్ సెంటర్స్ టెక్నీషియన్స్ సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది.
ఈ సమావేశంలో అదనపు జిల్లా వైద ఆరోగ్య శాఖ అధికారి డా. ఎన్ అనురాధ, జిల్లా మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ, డి ఐ ఓ ఈశ్వరిదేవి, డిప్యూటీ డెమో ఆఫీసర్ యం. వెంకటేశ్వర రావు, రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ డా. మోహనరావు, డా. మంత్రి వెంకట స్వామి, డాక్టర్ శ్రీనివాసరావు, హెల్త్ ఎడ్యుకేటర్స్ మోహిని, డాక్టర్స్, స్కాన్ సెంటర్స్ టెక్నీషియన్స్, తదితరులు పాల్గొన్నారు.
0 Comments