శ్రీకాకుళం, జనవరి 31 : ఓటర్ల జాబితాలో పేరు, చిరునామా తదితర సవరణల కోసం ఇప్పటివరకు 10,304 దరఖాస్తులు వచ్చాయని, గడిచిన వారం రోజుల్లో మార్పులు, చేర్పుల కోసం 4227 దరఖాస్తులు అందాయని జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు తెలిపారు. తన కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో 31వ వారపు సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితా (ఎస్ ఎస్ ఆర్ 2024)లో ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. తాజాగా వచ్చిన ఫారం 6, 7, 8 లను పరిశీలించి సప్లిమెంటరీ ఓటరు జాబితాలో చేరుస్తామన్నారు. కొత్తగా ఓటు నమోదు కోసం 1583 మంది గడిచిన వారం రోజుల్లో సంప్రదించారని అన్నారు. డిసెంబర్ 12 నుంచి ఇప్పటి వరకూ 12,267 కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారని క్షుణ్ణంగా పరిశీలించి వారికి ఓటు హక్కు కల్పిస్తామన్నారు. అయితే వీరిని సప్లమెంటరీ జాబితాలో చేర్చడం జరుగుతుందని తెలిపారు. అలాగే చిరునామా, పేరు, ఇతర సవరణలు కోరుతూ 10,304 మంది దరఖాస్తు చేసుకున్నారని వీటిలో 454 తిరస్కరించగా, 4424 పెండింగ్లో ఉన్నాయని మిగిలిన వాటిని ఆమోదించామని గణపతి రావు తెలిపారు. సమావేశంలో రౌతు శంకరరావు (వైయస్సార్సీపి), కే.వి.రామరాజు (టిడిపి), దేసెళ్ళ మల్లిబాబు (కాంగ్రెస్), సోమేశ్వరరావు (బి.ఎస్.పి), సురేష్ బాబు సింగ్ (బీజేపీ) సెక్షన్ సూపరింటెండెంట్ ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు.
0 Comments