ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలి

శ్రీకాకుళం,జనవరి,12: గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుటకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అధికారులను ఆదేశించారు. గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయా శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో గణతంత్ర దినోత్సవంను నిర్వహించనున్నట్లు తెలిపారు. వేదిక, స్టాల్స్, సిటింగ్ ఏర్పాట్ల చేయాలని ఆర్ అండ్ బి ఎస్ఈ ని ఆదేశించారు. గణతంత్ర దినోత్సవ నిర్వహణకు మైదానాన్ని సిద్దం చేయాలని, తాగునీరు ఏర్పాటు చేయాలని, పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ ని సమన్వయం చేసుకోవాలని నగరపాలక సంస్ధ కమీషనర్ ను ఆయన ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమ శాఖలు తమ శాఖల ప్రగతిని తెలియజేసే శకటాల ప్రదర్శనలను సిద్ధం చేయాలని ఆదేశించారు. 
స్టాల్స్ ఏర్పాటు చేసే శాఖలు సిఈఓ సెట్ శ్రీ, డిసిఓలను సంప్రదించాలన్నారు. స్టాల్స్ ఏర్పాటు చేసే శాఖల్లో ఆడుదాం ఆంధ్రా, పరిశ్రమలు, ఆస్తుల పంపకాల శాఖలు, తదితర శాఖలు ఏర్పాటు చేయాలని, స్టాల్స్ ఏర్పాటు చేసే శాఖలు డి.ఆర్.డి.ఏ పిడిని సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు. 
పరేడ్ కు పోలీసులు, ఎన్.సి.సి. కేడెట్లు, సమన్వయం చేసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 
సాంస్కృతిక కార్యక్రమాలు గణతంత్ర దినోత్సవం నిర్వహించే మైదానంలో ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలని డివిఈఓ, జిల్లా విద్యా శాఖ అధికారిని, స్వాతంత్య్ర సమర యోధులు, ప్రజా ప్రతినిధులు, ప్రోటోకాల్ చూసుకుని ఆహ్వానాలు పంపాలని డిఆర్ఓలను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించాలన్నారు. వేదిక ఏర్పాట్లపై సమీక్షించారు. డిగ్రీ కళాశాల వద్ద మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని డియంహెచ్ఓ ను ఆదేశించారు. ఆహ్వానం అందరికి అందాలన్నారు. 

*19 తేదీ నాటికి ప్రశంసా పత్రాల జాబితాలు అందాలి* 

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉద్యోగులకు అందించే ప్రశంసా పత్రాలకు సంబంధించి జాబితాను ఈ నెల 19వ తేదీలోగా ఫొటోలుతో డిఆర్ఓ కు అందజేయాలని జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఆదేశించారు. ఉద్యోగుల పేర్లతోపాటు వారు ఏ విధంగా ప్రశంసా పత్రానికి అర్హులో తెలియజేస్తూ వివరణ విధిగా తెలియజేయాలన్నారు. ప్రశంసా పత్రం పొందినవారికి సార్ధకత ఉండాలని చెప్పారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ మాట్లాడుతూ వేదిక ఏర్పాట్లలో ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా చూడాలని, సాంస్కృతిక కార్యక్రమాలకు ముందుగానే సిద్ధంగా ఉండాలని చెప్పారు. స్పీచ్ నోట్, తదితర ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. గణతంత్ర దినోత్సవం రోజున సరిపడే మాస్క్ లు అందుబాటులో ఉంచాలని, ప్రస్తుతం కోవిడ్ కేసులు ఎన్ని ఉన్నాయని కలెక్టర్ డియంహెచ్ఓ ను అడుగగా డిశంబరు 28 నుండి ఇప్పటి వరకు 23 పాజిటివ్ కోవిడ్ కేసులు వచ్చినట్లు డియంహెచ్ఓ కలెక్టర్ కు వివరించారు. అదనపు ఎస్పీ విఠలేశ్వరరావు పోలీసు బందోబస్తు ఏర్పాట్లు, పరేడ్ పై వివరించారు. 
ఈ సమావేశంలో టెక్కలి సబ్ కలెక్టర్ నూరుల్ కమర్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. గణపతిరావు, అదనపు ఎస్పీ విఠలేశ్వరరావు, ఆర్డీఓలు సిహెచ్. రంగయ్య, ఉప కలెక్టర్ పద్మావతి, డిపిఓ రవి కుమార్, డ్వామా పీడీ చిట్టిరాజు, డిఆర్డిఎ పిడి విద్యాసాగర్, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ ప్రసాదరావు, ఎపిసి జయ ప్రకాష్, డిఈఓ వెంకటేశ్వర్లు, బిసి కార్పొరేషన్ ఇడి గడ్డెమ్మ, హౌసింగ్ పీడీ గణపతిరావు, ఆర్టీఓ గంగాధర్, ఎల్డీయం సూర్యకిరణ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ పిడి శాంతి శ్రీ, వ్యవసాయ శాఖ జెడి శ్రీధర్, సిపిఓ లక్ష్మీ ప్రసన్న, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments