శ్రీకాకుళం, జనవరి 31: ప్రత్యేక హోదా సాధించాలన్నదే వైఎస్సార్సీపీ నినాదమని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. బుధవారం ఆయన శ్రీకాకుళంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొని తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి బతికి ఉండుంటే ఈ రాష్ట్రం విడిపోయేదికాదన్నారు. నిరంతరం ప్రణాళికాబద్ధంగా వైఎస్ జగన్ ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని, ఆయనే మళ్లీ సీఎం అవుతారని, వైఎస్ జగన్ నాయకత్వంలోనే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదాని సాధిస్తామని అన్నారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రత్యేక హోదా తాను సాధిస్తానని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసలు ఈ రాష్ట్రాన్ని విదగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అనే విషయం ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని, ఆ విషయం ఆమెకు తెలియక పోవటం వింతగా ఉందన్నారు. రాష్ట్ర విభజన వలన నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే మరిన్ని పరిశ్రమలు వచ్చి మౌలికంగా అభివృద్ధి జరుగుతుందని అందుకోసమే మా సీఎం జగన్ కృషి చేస్తున్నారని అన్న్నరు. అంతే గానీ రాజకీయ లబ్ధికోసం ప్రత్యేక హోదా అని ఎన్నికల ముందు కాస్త హడావిడి చేసి ఆ తర్వాత తప్పుకోవడం కొందరికి అలవాటుగా మారిందన్నారు. ఇప్పుడు వైఎస్ షర్మిల ఓనమాలు నేర్చుకున్నట్టు ఏబీసీడీలతో మొదలౌ పెడుతున్నట్తు ప్రత్యేకహోదా అంటూ పలవరిస్తున్నారని అన్నారు. తనకు చట్టసభల్లో ఎలాంటి ప్రాతినిధ్యం లేకుండా ఏదో సాధిస్తానని చెప్పుకోవడం ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. నిన్న తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ మనుగడ లేక పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి ఇప్పుడు ఆంధ్రా ఆడపడుచునని చెప్పుకుంటే సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందనే భ్రమల్లో ఆమె ఉన్నారన్నారు. ఆమె చేస్తున్నది ధర్మ బద్ధమైన చర్య కాదని ధర్మాన కృష్ణదాస్ అన్నారు.
0 Comments