రాష్ట్రప్రజలకు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికీ తీరని ద్రోహం చేసిన టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు నంగనాచిలా ఇప్పుడు ఎన్నో నీతి కబుర్లుచెబుతున్నారని, అవినీతి సామ్రాట్టయిన అతని కబుర్లకు మోసపోయే జనం శ్రీకాకుళం జిల్లాలో ఎవరూ లేరని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తీవ్రంగా ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలో సోమవారం టీడీపీ నిర్వహించిన రా కదలిరా సభలో చంద్రబాబు విమర్శలపై న కృష్ణదాస్ ఒక ప్రకటనలో ఘాటుగా ప్రతిస్పందించారు. ప్రజలకి ప్రభుత్వం నుంచి అందించాల్సిన పథకాలే కాకుండా ప్రజల కష్టార్జితాన్ని కూడా జన్మభూమి కమిటీల ద్వారా కాజేసిన చంద్రబాబునాయుడు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం జగన్ పై తప్పుడు ఆరోపణలు చేస్తుండడం విడ్దూరంగా ఉందని తెలిపారు. జగన్ కు సంపద సృష్టించడం రాదని చెప్పే ఈయన 2014 నుంచి 2019 వరకూ సృష్టించిన సంపద ఎంతో తేల్చాలని డిమాండ్ చేశారు. ఖజానా మొత్తం ఖాళీ చేసి చేతులెత్తేసిన చవటలు ఎవరో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసని పేర్కొన్నారు. విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ని చంద్రబాబు తన కులకోటరీతో కలిసి మరింతగా దోచున్నారని అన్నారు.
వైసీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టులకు దిక్కులేదు అని చెప్పే చంద్రబాబు కళ్ళూమూసుకుని మాట్లాడుతున్నారని, కళు తెరిచి చూస్తే ఏ ప్రాజెక్టులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుందని తెలిపారు. టీడీపీ-జనసేన అధికారంలోకి వస్తే ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని వట్టి కబ్రుచెప్పే చంద్రబాబు 2014 నుంచి 2019 మధ్య కాలంలో తన కొడుకు లోకేష్ కు మంత్రి పదవి అనే ఉద్యోగాన్ని ఇచ్చారు తప్ప ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత గురించి కనీసం పట్టించుకోలేదని తెలిపారు. తమ హయాంలో సచివాలయ వ్యవస్థ ద్వారా లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు.
జిల్లాలో వైసీపీ నాయకులపై నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. జిల్లాలో టీడీపీ నేతల అవినీతి చిట్టాలు ఎన్నో ఉన్నాయన్నారు. అవన్నీ ఈ జిల్లా ప్రజలకు బాగా తెలుసని పేర్కొన్నారు. ఎల్లో మీడియా రాతల్నే పాట పాడుతున్న చంద్రబాబు వాటిని నిరూపించగలరా..లేనిది ఉన్నట్టు బుకాయిస్తే మీ మోస పూరిత మాటలను నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరని కృష్ణదాస్ విమర్శించారు.
0 Comments