ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

శాంతినగర్ కాలనీ వద్ద ఇసుక అక్రమ తవ్వకాలు: బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యులు చల్లా వెంకటేశ్వర రావు

శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలోని శాంతినగర్ కోలనీ వద్ద నాగావళి నదిలో ఇసుక అక్రమ రవాణా సాగుతోందని, వెంటనే ఆపుదల చేయాలని శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబులేసుని బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యుడు చల్లా వెంకటేశ్వర రావు కోరారు. 

శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలోని శాంతినగర్ కోలనీ వద్ద నాగావళి నదిలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఇసుక దిబ్బలు ఉండేవని, శ్రీకాకుళం నగరానికి వరద నీరు రాకుండా, ఈ ఇసుక దిబ్బలు రక్షణ గోడగా ఉండేవని తెలిపారు. 

గత వైకాపా హయాంలో, ఇసుక ధర విపరీతంగా పెరిగిన కారణంగా, ఇసుక అక్రమార్కులు రాత్రిపూట వందల సంఖ్యలో ఎడ్ల బండ్లతో, పగలు వందల సంఖ్యలో కూలీలను పెట్టి ఆటోలు, ట్రాలీ రిక్షాలపై తరలించుకు పోయిన సందర్భంగా అక్కడ ఇసుక దిబ్బలు కరిగిపోయాయని తెలిపారు. దీని కారణంగా అనాడు వరదనీరు పెద్ద ఎత్తున వచ్చి అప్పటికే 80% నిర్మాణం పూర్తి చేసుకున్న రూ. 5 కోట్ల రూపాయల సబ్ సర్ఫేస్ డైక్ నిర్మాణం, పక్కనే ఉన్న ఆర్సిఎం స్కూల్ ప్రహరీ గోడ కొట్టుకు పోవడమే కాకుండా, నగరవాసులకు త్రాగునీరు అందించే ఊట బావులు ధ్వంసం అయ్యాయని, నదీ గమనం కూడా మారిపోయిందని తెలియజేసారు. ఈ ఇసుక దిబ్బలను అక్రమంగా కొల్లగొట్టిన కారణంగా, శ్రీకాకుళం నగరానికి వరద నీరు రాకుండా, తాత్కాలికంగా కోటి రూపాయలతో భవన నిర్మాణ రద్దు, ఇసుకతో నింపిన బస్తాలను పేర్చి రక్షణ గోడగా, కార్పొరేషన్ అధికారులు నిర్మించారని గుర్తు చేశారు. 

ఆనాడు మున్సిపల్ కార్పొరేషన్, మైనింగ్, రెవెన్యూ, పోలీసు శాఖలకు ఫిర్యాదు చేసిన కారణంగా, నెలల జాప్యం తరువాత, కోట్ల రూపాయల నష్టం వాటిల్లిన తరువాత శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కళ్లు తెరిచి, ఇక్కడ అక్రమ రవాణా ఆపేశారని అన్నారు. ఫిర్యాదు చేసిన వెంటనే ఇక్కడ అక్రమ రవాణా ఆపి ఉంటే ప్రభుత్వానికి సుమారుగా 10 కోట్ల రూపాయల నష్టం వాటిల్లేది కాదని అన్నారు. 

ప్రస్తుతం ఇసుక అక్రమార్కులు, మరోసారి ఈ ప్రాంతంపై కన్నేశారని. ప్రతిరోజూ రాత్రి 10. 30 నుండి వేకువ జామున వరకు వందల సంఖ్యలో ఎడ్లబండ్ల లోడ్లు శాంతినగర్ కోలనీలో మొదటి లైను నుండి అక్రమ రవాణా చేస్తున్నారని తెలిపారు. 

గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని, నగరానికి వరద ముప్పు రాకుండా, సబ్ సర్ఫేస్ డైక్ నిర్మాణం ఉన్నది కొట్టుకుపోకుండా, డే అండ్ నైట్ బ్రిడ్జికి ప్రమాదం వాటిల్లికుండా, నది ఒడ్డు కోతకు గురి కాకుండా, కోలనీ వాసుల నిద్రకు భంగం కలగకుండా ఉండాలంటే, వెంటనే మున్సిపల్ కార్పొరేషన్, గనులు, రెవెన్యూ, పోలీసు శాఖలు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు స్పందించి, ఈ అక్రమ రవాణాను నిరోధించాలని చల్లా వెంకటేశ్వర రావు కోరారు. 

Post a Comment

0 Comments