శ్రీకాకుళం:కేంద్ర బడ్జెట్ రైతాంగ, కార్మిక వ్యతిరేక బడ్జెట్ అని పలువురు వక్తలు అన్నారు. వ్యవసాయానికి, గ్రామీణ ప్రాంతాలకు అన్యాయం చేసిన కేంద్ర బడ్జెట్ కు నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో అంబేద్కర్ జంక్షన్ వద్ద సోమవారం నిరసన తెలిపారు. బడ్జెట్ ప్రతులను దగ్ధం చేయడానికి సిద్దమవగా పోలీసులు అడ్డుకోవడంలో పోలీసులకు, ప్రజా సంఘాలు నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో వ్యవసాయానికి, గ్రామీణ ప్రాంతాలకు మోడీ ప్రభుత్వం మరోమారు అన్యాయం చేసిందని, పేద,మధ్య తరగతి ప్రజలపై భారాలు వేసి కార్పొరేట్లకు దోచిపెట్టేలా బడ్జెట్ ఉందని పేర్కొన్నారు. రైతాంగ, కార్మిక, పేద ప్రజలు, గ్రామీణ వ్యతిరేక సంస్కరణలను ముందుకు తీసుకెళ్లేదిగా ఉందన్నారు. కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడేందుకు వ్యవసాయ రంగాన్ని కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందన్నారు. 2022-23లో కన్నా ఈ బడ్జెట్లో ఎరువుల సబ్సిడిలో 35 శాతం, ఆహార సబ్సిడీలో 25 శాతం, ఉపాధి హామీ చట్టం నిధుల్లో 20 శాతం కోతపెట్టిందన్నారు. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా చేసే ఏ ఒక్క చర్యా తీసుకోలేదని చెప్పారు. బీహార్ కు గ్రాంటు రూపంలో భారీగా నిధులిచ్చిన కేంద్రం రాష్ట్ర రాజధాని నిర్మాణానికి రూ.15 వేల కోట్లు అప్పు సమకూర్చుతామని చెప్పడం బాధాకరమన్నారు. కార్మిక వర్గాన్ని అసలేమీ పట్టించుకోలేదని పూర్తిగా పెట్టుబడిదారులకి అనుకూలమైన బడ్జెట్ అని తెలిపారు. కేంద్ర బడ్జెట్ ఉత్త మాటల గారడీగా ఉందని కీలకమైన రంగాలకు తగిన కేటాయింపులు లేవని అన్నారు. ధరల పెరుగుదలకు కారణమై, సామాన్యుల దైనందిన జీవితాన్ని అతలాకుతలం చేస్తున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టటానికి ఏ చర్యలూ ప్రకటించలేదు. విద్యా, వైద్య రంగాలకు తగిన కేటాయింపులు లేదన్నారు. గతంలో మోడీ ఇచ్చిన ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ ఏమయ్యిందని ప్రశ్నించారు. ఇది కార్పొరేట్లను, అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడిదారులను సంతృప్తపరిచే చర్యే తప్ప దేశ ప్రజలకు దోహదపడేది కాదు. ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రాలకు జరిపే నిధుల కేటాయింపు బిజెపి హయాంలో అంతకంతకు కుదించుకుపోతోంది. 2022 బడ్జెట్తో పోలిస్తే ఈసారి ఏకంగా రూ.40 వేల కోట్లకు ఎగనామం పెట్టేశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ఈసారి కూడా కేటాయింపుల్లో తీరని ద్రోహం జరిగింది. గొప్ప సాయం అందిస్తున్నట్టు ప్రసంగంలో ప్రవచించినా తగిన నిధులు కేటాయింపు చేయలేదని, విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని నెరవేర్చటానికి నిర్ధిష్టమైన కేటాయింపులు చేయలేదు. రాజధాని నిర్మాణానికి రూ.15 వేల కోట్ల నిధులను అంతర్జాతీయ ద్రవ్య సంస్థల ద్వారా రుణం తీసుకోవటానికి సాయపడతామని చెప్పారే కానీ, గ్రాంటుగా ఇవ్వడం లేదని, ఈ అప్పును ఎవరు చెల్లిస్తారో, వడ్డీని ఎవరు భరిస్తారో స్పష్టత లేదని అన్నారు. విశాఖ రైల్వే జోనూ ఊసే లేదని, విశాఖ ఉక్కు పరిరక్షణకు బడ్జెట్లో భరోసా ఏమీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసారు. విభజన హామీలను అమలు జరపటం కేంద్ర ప్రభుత్వ బాధ్యతని, రాజధాని నిర్మాణానికి, పోలవరం పూర్తికి, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకూ తగినన్ని నిధులు పొందటం మన హక్కు అని అన్నారు. బడ్జెట్ ప్రవేశ పెట్టటానికి ముందే సిఐటియు, ఇతర కార్మిక సంఘాలు ఆర్ధిక శాఖ మంత్రిని కలిసి చేసిన సూచనలను ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ తాండ్ర.ప్రకాష్, ఎపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.మోహనరావు, సిఐటియు జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు సి.హెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, ఎపి కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్ష"ప్రధాన కార్యదర్శులు వెలమల.రమణ, పి.ప్రసాద్, సిఐటియు నాయకులు కె.సూరయ్య, టి.ప్రకాష్, పి.గోపి, రైతు కూలీ సంఘం నాయకులు ఎస్.కృష్ణవేణి, ఎస్.ఎఫ్.ఐ జిల్లా అధ్యక్షులు పి.చందు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments